
రోడ్డు ప్రమాదంలో యువ రైతు మృతి
పెదకూరపాడు: ఆ కుటుంబానికి ఆ యువకుడే ఆధారం. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారం తనపై వేసుకుని చెల్లికి వివాహం చేశాడు. చదువు కూడా మానుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నాడు. అలాంటి ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దీంతో కుమారుడి మృతదేహం చూసి తల్లి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయా.. అంటూ రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు... పెదకూరపాడుకు చెందిన నర్రా హేమంత్ (29) ఈ నెల 12వ తేదీన సత్తెనపల్లి మండలం గుడిపూడి, సందిగామ గ్రామాల్లో జరిగిన అచ్చమాంబ తిరునాళ్లకు రాత్రి సమయంలో వెళ్లాడు. పెదకూరపాడు నుంచి నందిగామకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హేమంత్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
చిన్నతనంలోనే తండ్రి మరణం....
హేమంత్ చిన్నతనంలో తండ్రి కోటేశ్వరరావు మరణించారు. దీంతో కుటుంబ భారం తల్లి రాజేశ్వరిపై పడింది. తనతోపాటు తన చెల్లి బాధ్యతలు స్వీకరించిన హేమంత్ ఇంటర్ వరకు చదివి మానేశాడు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయం ప్రారంభించాడు. ఈ క్రమంలో చెల్లి వివాహం చేసి, సొంత పొలంతోపాటు కౌలుకు కొంత పొలం తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో హేమంత్ మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. చేతికొచ్చిన కుమారుడు మృతితో తల్లి రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. హేమంత్ మృతితో పెదకూరపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.
పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబం
పెదకూరపాడులో విషాదఛాయలు