పీహెచ్‌సీలో ప్రసవాలు జరిగేలా చూడాలి
బెల్లంకొండ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది ప్రోత్సహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.రవి తెలిపారు. బుధవారం మండలంలోని చండ్రాజుపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల కొరకు వచ్చిన బాలింతలు, తల్లులతో ఆయన మాట్లాడారు. క్రమం తప్పకుండా సరైన సమయంలో టీకాలను వేయించాలని సూచించారు. అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యసాధన, వాటి ప్రగతిపై సమీక్ష చేశారు. ఆన్‌లైన్ సర్వే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పీహెచ్‌సీలో ప్రసవాల ప్రగతి చాలా తక్కువగా ఉండడాన్ని గమనించారు. వైద్యశాలలో అన్ని రకాల పరికరాలు ఉన్నప్పటికీ, 24 గంటలు సేవలు అందిస్తున్నప్పటికీ ప్రసవాలు ఎందుకు చేయలేకపోతున్నారని వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాలలో ప్రసవాల ప్రగతి పెంపొందించాలని సూచించారు. ఆయన వెంట పీహెచ్‌సీ వైద్యాధికారి డా.నజీర్, సీహెచ్‌ఓ మణికుమారి, సూపర్‌వైజర్ బాషా, సిబ్బంది ఉన్నారు.


