అమరావతి: అమరేశ్వరుడికి వేలం పాటల ద్వారా రూ.54.22 లక్షలు ఆదాయం వచ్చింది. ఆలయంలో దుకాణాలకు గురువారం బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2026 మార్చి 31 వరకు పాటదారులు వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. ఆలయంలో కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడాన్ని రూ. 9.51లక్షలకు, ఆవరణలో కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్ముకునేందుకు రూ.17.20లక్షలు, పార్కింగ్ రుసుం వసూలును రూ.10.61లక్షలకు, బొమ్మలు అమ్ముకునే హక్కుకు రూ.3.90 లక్షలకు, నదీ తీరంలో కూల్‌డ్రింక్స్ షాపునకు రూ.9.9లక్షలకు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు రూ. 2.66 లక్షలకు, తలనీలాలకు రూ. 20వేలు, మొదటి ప్రాకారంలో కూల్‌డ్రింక్స్ షాపు నిర్వహణకు రూ. 1.5లక్షలకు పాడుకున్నట్లు ఆయన వివరించారు. స్వామికి ఆదాయం గత ఏడాది రూ. 49.44 లక్షలు రాగా ఈ ఏడాది రూ.54.22 లక్షలు వచ్చినట్లు చెప్పారు. గత ఏదాది కంటే రూ.4.78 లక్షలు అధికంగా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
సిండికేట్‌తో ఆదాయానికి గండి
పాటదారులు సిండికేట్ కావడంతో అమరేశ్వరుని ఆదాయానికి గండిపడింది. ఒకటి, రెండు వ్యాపారాలకు తప్పా మిగిలిన అన్నింటిలో పాటదారులు సిండికేట్ అయ్యారు. అధికారులు కూడా పార్కింగ్, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కుకు అధిక మొత్తంలో పాట పెంచారు. మిగిలిన వ్యాపారాలకు తక్కువ మొత్తంలో పెంచి మమ అనిపించారు. ఈ విధంగా దేవుని ఆదాయానికి గండి కొట్టటం దారుణమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.