దొడ్లేరు(క్రోసూరు): సాగర్ నీళ్లు విడుదల కాక, వదిలినా దిగువ పొలాలకు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం దొడ్లేరులో రైతులు ధర్నా చేపట్టారు. రబీలో దాళ్వా వరి సాగు చేస్తున్న వారంతా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలువల్లో చుక్క నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. క్రోసూరు మండలం దొడ్లేరు పరిధిలోని కస్తల మైనర్ కింద 500 హెక్టార్ల ఆయకట్టు ఉంది. దీనికి నాగార్జున సాగర్ కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తారు. అవి ఎర్రబాలెం మేజర్ దాటుకుని, చింతపల్లి మేజర్‌కు వెళ్లే మార్గంలో దొడ్లేరులోని కస్తల మైనర్‌కు రావాలి. అయితే, నీళ్లందక కస్తల మైనర్ డ్రాప్ కూడా ఎండిపోయింది. పొలాలకు నీళ్లు వచ్చే దిక్కే లేదు. దీనిపై కెనాల్స్ ఏఈ బండి శ్రీనివాసరావును వివరణ కోరిగా 500 క్కూసెక్కులకు గానూ ప్రస్తుతం 350 మాత్రమే సరఫరా అవుతున్నాయని తెలిపారు. వారాబందీ పద్ధతిలో నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. నాలుగు రోజులు ఎర్రబాలెం మేజర్‌కు, తర్వాత నాలుగు రోజులు కస్తల మైనర్‌కు వదులుతామని తెలిపారు. గురువారం దొడ్లేరు పొలాలకు విడుదల చేస్తామని వెల్లడించారు.
పంటలను కాపాడండి
నేను పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. కాలువ నీళ్లు రాకపోవడంతో కళ్ల ఎదుటే పంట ఎండి పోతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.
–షేక్ బాషా, దొడ్లేరు
నీరు అందడం లేదు
కాలువకు నీళ్లు విడుదల చేయడం లేదు. చేసినా కింద పొలాలకు అందడం లేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి.
– షేక్ కరీమూన్, దొడ్లేరు
పది రోజులుగా
ఎండిపోతున్న పంటలు
సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్న
సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్న