నరసరావుపేట: కోటప్పకొండరోడ్డులోని రజకుల సత్రం స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని స్థలాన్ని తిరిగి ఇవ్వాలని అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు కోరారు. మంగళవారం కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ కె.మధులతను కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈసందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు ఉదయగిరి వెంకటస్వామి మాట్లాడుతూ గుంటూరు బ్రహ్మయ్యకు సేవలు చేసినందుకు గాను 1940లో కోటప్పకొండరోడ్డులోని వారి స్థలంలో ఐదుసెంట్ల భూమిని రజక వర్గీయులైన దడిగె లక్ష్మయ్య, రాఘవులకు ఇవ్వటం జరిగిందన్నారు. ఆ భూమిలో ఐదేళ్లలో సత్ర నిర్మాణం చేసుకోవాలని కండిషన్ పెట్టడంతో కష్టపడి చందాలు వసూలుచేసి అన్నపూర్ణ సత్ర నిర్మాణం చేశారన్నారు. ఆ స్థలాన్ని రజకులకు రిజిష్టర్ చేయటం జరిగిందన్నారు. వారిలో రాఘవులు చనిపోవటంతో అతడి మృతదేహాన్ని సత్రం వెనుక పూడ్చిపెట్టి సమాధి నిర్మాణం చేశారన్నారు. అప్పటినుంచి కోటప్పకొండకు వచ్చే రజక భక్తులకు అన్నపానీయాలు అందజేయటం జరుగుతుందన్నారు. ఈ మధ్యకాలంలో సమాధిని కూలగొట్టి దానిపక్కనే ఉన్న వారి స్థలంలో కలుపుకొని మొత్తానికి ప్రహరీ ఏర్పాటు చేశారన్నారు. ఈ చర్యతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఘటనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకొని, రజకుల స్థలాన్ని కాపాడాలని వారు కోరారు. నడికోట సూర్యనారాయణ, దమ్మాటి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, దన్నవరపు ఆదిలక్ష్మి, జి.హనుమంతరావు, డి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓను కోరిన అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు