ముప్పాళ్ళ: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పదివారాలకు పైగానే కూలి డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. ఒక పక్క వేతనాలు అందక, మరో పక్క పనిచేసే చోట కనీస సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు. మార్చి నెలలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కూలీల బాధ వర్ణనాతీతంగా మారింది. పని ప్రదేశాల్లో కనీసం నీడ, మంచినీటి సదుపాయం కూడా లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. మరో వైపు కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్‌లను రాజకీయ వేధింపులతో తొలగించడంతో ఆయా పంచాయతీలలో ఇన్‌చార్జ్ మేట్‌లతో పనులను కొనసాగిస్తుండటంతో పనులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతుంది. అంతే కాకుండా కనీస వేతనంగా రూ.300 అందజేస్తామని చెప్పినప్పటికీ ఆ దిశగా వేతనాలు గిట్టుబాటు కావడం లేదని వేతనదారులు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే ఫామ్ పాండ్ (సేద్యపు కుంట)నిర్మాణాల లక్ష్యాలు విధిస్తూ ఉపాధిహామీ సిబ్బందిపై ఒత్తిడిలు ప్రారంభయ్యాయి. ఒక వైపు పనులు, మరో వైపు లక్ష్యాలతో ఉపాధిహామీ సిబ్బంది సతమతమవుతున్నారు.
నాలుగు వారాల కూలి రావాలి
నాలుగు వారాలు ఉపాధి హామీ పనికి వెళ్లాను. ఎండలో చాలా దూరంగా నడుచుకుంటూ వెళ్లి పనిచేశాం. ఇంత వరకు రూపాయి రాలేదు. అడిగితే మీ ఖాతాల్లోనే జమ అవుతాయని చెబుతున్నారు. మళ్లీ పని చూపించటం లేదు.
– దేశిరెడ్డి వేమారెడ్డి, చాగంటివారిపాలెం
రెండు రోజుల్లో జమ అవుతాయి
ఉపాధి పనులకు సంబంధించి ఇటీవల కొంత వేతనాలు పెండింగ్ వాస్తవమే. జనవరి 15వ తేదీ వరకు బిల్లులు వచ్చాయి. బకాయిలపై ప్రభుత్వానికి నివేదిక అందించాం. మరో రెండు రోజుల్లో బకాయిలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
–ఎం.సిద్ధలింగమూర్తి, పీడీ, డ్వామా, పల్నాడు జిల్లా
పల్నాడు జిల్లా పరిధిలో 530 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం 2,66,000 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 4,54,00 మంది కూలీలు పనులకు హాజరవుతారు. ఈ ఏడాది మొత్తం 39వేల పనులు గుర్తించారు. అందులో 8వేల పనులు పూర్తి కాగా, 31వేల పనులు జరుగుతున్నాయి. 6,915 మంది వందరోజులు పనిదినాలు పూర్తి చేశారు. ఇప్పటివరకు సుమారు 5 లక్షల వరకు పనిదినాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం అధికారుల అంచనాల ప్రకారం ఒక్కొక్కరికీ రోజుకు రూ.250 నుంచి రూ.270 వరకు వేతనం అందాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం పది వారాలకు గాను సుమారు రూ.22.79 కోట్ల మేర కూలి డబ్బులు రావాల్సి ఉంది. పది వారాలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కూలీలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు.
ఉపాధి కూలీలకు పది వారాలుగా అందని వేతనాలు జిల్లా వ్యాప్తంగా రూ.22.759 కోట్ల బకాయిలు ఎర్రటి ఎండలోనే పనిచేస్తున్న కూలీలు పని ప్రాంతాల్లో కనిపించని సదుపాయాలు
వేతనాల కోసం ఎదురు చూపులు..
మండే ఎండలు.. కాలే కడుపులు!