గురుకుల చదువులపై సమ్మెట
నరసరావుపేట రూరల్: గిరిజన గురుకుల పాఠశాలల్లో టీచర్లు లేకపోవడంతో విద్యా బోధన అటకెక్కింది. ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టడంతో పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడింది. ఇప్పటికీ సిలబస్ పూర్తికాకపోవడంతో 10వ తరగతి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పెదతురకపాలెంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో నెలరోజులుగా విద్యాబోధన నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా పాఠశాలలో పనిచేస్తున్న 8 మంది అవుట్ సోర్సింగ్ టీచర్లలో ఆరుగురు గత నెల 14వ తేదీ నుంచి పాఠశాలకు గైర్హాజరవుతున్నారు. ఒకరు మెడికల్ లీవ్‌లో ఉండగా, ఒకరు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు 170 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈనెల 11 నుంచి ఎఫ్‌ఏ వన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం సిలబస్ కూడా పూర్తికాకపోవడంతో విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని..
15ఏళ్లుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టులను ఖాళీ చూపిస్తూ డీఎస్సీలో చేర్చడంపై మండిపడుతున్నారు. తమను రెగ్యులర్ టీచర్లుగా పరిగణించాలని సమ్మెబాట పట్టారు. నెల రోజుల నుంచి టీచర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే సమ్మె నేపథ్యంలో ఇతర పాఠశాలల్లోని టీచర్లను అడ్జస్ట్‌మెంట్ ద్వారా పంపాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు డీఈఓను కోరినా పట్టించుకోలేదని తెలుస్తోంది.
ఎస్టీ గురుకుల పాఠశాలలో టీచర్ల సమ్మె బాట గతనెల 14 నుంచి విధులకు గైర్హాజరు పరీక్షల సమయం దగ్గరవడంతో విద్యార్థినుల్లో ఆందోళన


