విలోమ కథలు 3వ ముద్రణ
తెనాలి: ప్రముఖ రచయిత, కవి నగ్నముని రచించిన విలోమకథలు మూడో ప్రచురణ వెలువడింది. రచయిత స్వస్థలమైన తెనాలిలో ఈనెల 17న ఆవిష్కరించి, నగ్నమునిని సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సాహితీ విశేషాల రేఖామాత్ర పరిచయమిది. తెనాలిలో 1940లో జన్మించిన నగ్నముని తన 17వ ఏటనే ‘సుధ’ పేరుతో ‘తెలుగు స్వతంత్ర’లో ‘సౌందర్యపు స్వగతం’ కవిత రాశారు. అప్పటి నుంచి దేశానికి చీకటి రోజులను ప్రసాదించిన ఎమర్జన్సీ నుంచి పెల్లుబికిన విలోమ కథలు వరకు తెలుగు సాహిత్యంలో ప్రయోగాత్మక ఒరవడికి ఆద్యుడిగా నిలిచారు. తొలి ఆధునిక మహాకావ్యంగా, రాజకీయ తాత్విక కావ్యంగా తన ‘కొయ్యగుర్రం’ లేవనెత్తిన చర్చ ఒక చరిత్ర. వర్తమాన వికృతరూపాన్ని ‘ఆకాశదేవర’తో హెచ్చరించారు. సాహిత్యాన్ని ఉద్యమస్థాయికి తీసుకెళ్లిన దిగంబర కవిత్వానికి ‘కర్త, కర్మ, క్రియ నేనే’నంటూ సగర్వంగా ప్రకటించుకొన్న అగ్నిఖని ‘నగ్నముని’. ఎనిమిది దశాబ్దాల క్రితం తెనాలిలో కళ్లు తెరిచిన మానేపల్లి హృషీకేశవరావు, నగ్నమునిగా మారడం అంత తేలిగ్గా జరగలేదు. కృష్ణాపత్రిక లాంటి పత్రికల్లో కవిత్వం రాసిన ఆయన తండ్రి మానేపల్లి సంగమేశ్వర కవి పద్య వారసత్వాన్ని కొనసాగించాడు నగ్నముని. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి, అసెంబ్లీలో ఉద్యోగంలో చేరే నాటికి ఆయన వయసు పద్దెనిమిదేళ్లు. అప్పట్నుంచి నాలుగు దశాబ్దాలపాటు రాజకీయ నేతల అసలు రూపాన్ని దగ్గరగా చూశారు. ఆయన కవిత్వం మొదలుపెట్టే నాటికి కాలం అనేక సంక్షోభాలను చవిచూసింది. అయిదు దశాబ్దాల నగ్నముని సాహిత్య జీవితం, తెలుగునేలపై జరిగిన అన్ని కల్లోలాలను ఒక క్రమపద్ధతిలో నమోదు చేసింది. తెలుగు సాహిత్య వాక్యానికి రాజకీయ వాసనలు అద్దాడు. రాజ్యహింసను, నిర్బంధాలనూ అనుభవించాడు. తాను చూసిన సంక్షోభాలు, విచ్ఛిన్నమవుతున్న మానవ విలువలు, సాహిజిక సందర్భాలు ఎదు ర్కొనే క్రమంలో జరిగిన మాన ప్రాణ నష్టాలను దగ్గరగా చూశారు. ‘ఎమర్జన్సీ మన అస్తిత్వ చరిత్రకే అవమానకరం’అని ఎలుగెత్తినవాడు నగ్నముని. ‘విలోమ కథలు’తో మొదలైన ఆ పరంపర ‘ఆకాశదేవర’ వరకు కొనసాగింది. ఆనాడు–ఎమర్జన్సీని ఏ రచయితా నిర సించలేదు. నగ్నముని రాసిన ‘విలోమ కథలు’ ప్రకంపనలు కలిగించాయి.. సంప్రదాయ రూపాన్నీ, వస్తువునీ ధ్వంసం చేశాయి. ‘రాజకీయ విలువలు తల్లకిందులైనచోట ప్రజలు మనుషులుగా బతకడం కష్టం’ అంటారు నగ్నముని. దిగంబర కవిత్వంతో నిద్రపోతున్న సాహిత్యలోకాన్ని ఒక చరుపు చరిపి లేపినవాడు కనుక–అయితే ఆకలి కథలు, లేకపోతే ప్రేమకథలు అనే పద్ధతిలో సాగుతున్న కథారచనను కొత్త మార్గాలకు పట్టించారాయన. రాజకీయాలు, జీవిత విశ్వాసాలు, విలువ లు తలకిందులుగా నడుస్తున్నాయని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడానికి ఎంచుకున్న విలోమ శైలి సాహిత్యంలో మరో ప్రయోగం. ఈ కథలతో ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యారు కూడా! ఎమర్జన్సీ తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. పత్రికల్లో కాలమ్ వ్యాసాలు రాశారు. మరోచరిత్ర, ఎంఎల్‌ఏ ఏడుకొండలు, త్రిశూలం, ఉదయం సినిమాలకు మూలకథలు సమకూర్చారు. అంతకుముందే ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపిల్ల’ నవలను నాటకీకరించారు. ఈ నాటకాన్ని ఏఆర్ కృష్ణ వివిధ చోట్ల వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. 2011లో రచించిన ‘ఆకాశదేవర’ను పాటిబండ్ల ఆనందరావు నాటకీకరించారు. తెనాలిలో అజోవిభోకందాళం ఫౌండేషన్ నగ్నమునిని సత్కరించి ‘సాహితీ వైజయంతి’ శీర్షికతో సన్మాన విశేషసంచికను విడుదల చేశారు.
సాహిత్య వాక్యానికి రాజకీయ
వాసనలు అద్దిన కవి
తెలుగు నేలన దిగంబర
కవిత్వోద్యమానికి సారథి
‘ఎమర్జన్సీ’తో పెల్లుబికిన విలోమ కథలు
17న తెనాలిలో నగ్నముని విలోమ
కథలు ఆవిష్కరణ సందర్భంగా..


