జీతం కావాలంటే.. లంచం తప్పదు

Accounts Officer Demands Bribe Of Ten Thousand Rupees For Giving Salary - Sakshi

సాక్షి, ఒడిశా :  ఒక ఉపాధ్యాయినికి సంబంధించిన మూడు నెలల జీతం చెల్లించాలంటే రూ.పదివేలు లంచం ఇవ్వాలి. లేదంటే ఫైల్‌ ముందుకు కదలదంటూ తెగేసి చెప్పిన భాగోతం ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జిల్లా పరిధిలో గల కొల్నారా సమితిలోని ఆగుడి గ్రామం పాఠశాలలో పనిచేస్తున్న జ్యోతిర్మయి మల్లిక్‌ అనే ఉపాధ్యాయిని మెటర్నిటీ లీవ్‌పై  వెళ్లారు.

సెలవు అనంతరం తనకు రావాల్సిన మూడు నెలల జీతాన్ని చెల్లించమని సమితి విద్యాధికారి ఎం. ఖగేశ్వరావును ఆమె సంప్రదించింది. త్వరలో జీతం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడంతో ఉపాధ్యాయిని వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా ఇంకా చెల్లించక పోవడంతో సమితి విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అకౌంటెంట్‌ ఫరీదా బేగంను సంప్రదించింది. జీతం అందాలంటే రూ.పది వేలు చెల్లించాలని అకౌంటెంట్‌ లంచం డిమాండ్‌ చేసింది. నెల జీతం రూ.6,400 అయితే రూ.పదివేలు ఎలా ఇవ్వగలనని ఉపాధ్యాయిని జ్యోతిర్మయి మల్లిక్‌ వాపోయింది.


జ్యోతిర్మయి మల్లిక్‌ (ఉపాధ్యాయిని), అకౌంటెంట్‌ ఫరీదా బేగం

వారిద్దరి సంభాషణలకు సంబంధించిన ఆడియో వైరల్‌ కావడంతో విషయం బయటకొచ్చింది. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ బెహరా  దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఈ మేరకు ఉపాధ్యాయిని జ్యోతిర్మయి మల్లిక్, అకౌంటెంట్‌ ఫరీదా బేగంను జిల్లా తన కార్యాలయానికి డీఈఓ  పిలిపించి విచారణ చేపట్టి ఇద్దరి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి అకౌంటెంట్‌ బేగంను విలేకరులు ప్రశ్నించగా ఇదంతా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారమని ఖండించారు. ఉపాధ్యాయిని జ్యోతిర్మయి మల్లిక్‌ మాత్రం తనకు జీతం చెల్లించాలంటే రూ.పదివేలు లంచం అడిగిన మాట వాస్తవమని అందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని జిల్లా విద్యా శాఖాధికారికి అందించానని చెప్పారు. 

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top