రాయగడ: సదరు పోలీస్స్టేషన్ సమీపంలోని ఒక కిరాణా దుకాణంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దుకాణంలోని సమారు రూ.10 లక్షలు విలువ చేసే సామగ్రి కాలిబూడిదయ్యాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలోఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నప్పటికీ అప్పటికే దుకాణంలో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు సిబ్బందికి సుమారు గంట సమయం పట్టింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారి భావిస్తున్నారు. దుకాణం యజమాని రాజేంద్ర మిశ్రా తెలియజేసిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లానని చెప్పారు. ఉదయం దుకాణం సమీపంలోని కొందరు.. తమ దుకాణం మంటల్లో చిక్కుకుందని సమాచారం ఇవ్వడంతో పరుగులు తీశానన్నారు. అయితే ఎగిసిన మంటలు, దట్టమైన పొగ దుకాణం చుట్టూ కమ్ముకోవడంతో సామగ్రి కాలిబూడిదైనట్లు వెల్లడించారు. సమారు రూ.10 లక్షలు విలువచేసే సామగ్రి దగ్ధమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.


