రాయగడ: రైల్వే ద్వారా పార్శిళ్ల రవాణాను మరింత సురక్షితంగా మార్చడంతో పాటు నిషేధిత, ప్రమాదకర వస్తువుల రవాణాను అరికట్టేందుకు తూర్పుకోస్తా రైల్వే కీలక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మూడు రైల్వే డివిజన్ల పరిధిలోని 10 ప్రధాన పార్సిల్ స్కానర్ల యంత్రాలను ఏర్పాటు చేసి వినయోగంలోకి తీసుకువచ్చింది. ఈ సౌకర్యం రాయగడ రైల్వే స్టేషన్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దారోడ్ డివిజన్ లో 5 ప్రాంతాలు సంబల్‌పూర్ డివిజనల్‌లో నాలుగు ప్రాంతాలు, రాయగడ డివిజన్‌లో ఒక ప్రాంతంలో ఈ స్కానింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఖుర్ధా రోడ్ డివిజన్ పరిధిలో భువనేశ్వర్, పూరీ, ఖుర్దా రోడ్, కటక్, బరంపురం స్టేషన్లలో ఆధునిక పార్సిల్ స్కానర్లు పనిచేస్తున్నాయి. సంబల్‌పూర్ డివిజన్ పరిధిలోని సంబల్‌పూర్, టిట్లాఘఢ్, బలంగీర్, కంటాబంజి స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రాయగడ డివిజన్ పరిధిలో రాయగడ స్టేషన్‌లో కూడా పార్సిల్ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.
గంజాయి పంట ధ్వంసం
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి సరిగేట, చింతగుణ గ్రామాల సమీప ప్రాంతాల్లో అక్రమంగా 10 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటలను కలిమెల పోలీసులు గురువారం ధ్వంసం చేశారు. మొత్తం 10 వేల మొక్కలను ధ్వంసం చేసి, రెండు గ్రామాలపై కేసులు నమోదు చేశారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడంతో పాటు, ఈ ప్రాంతంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు ఇటువంటి దాడులు కొనసాగిస్తామని కలిమెల ఐఐసీ ప్రభుదత్తు విశ్వాస్ స్పష్టం చేశారు. ధ్వంసం చేసిన సాగు విలువ రూ.30 లక్షలు ఉంటుందన్నారు. దర్యాప్తు చేసి సాగుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మల్కన్‌గిరిలో పోలీసుల సేవా కార్యక్రమం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి పోలీసు యంత్రాంగం తరుపున సేవ కార్యక్రమానికి ఎస్పీ వినోద్ పటేల్ గురువారం శ్రీకారం చుట్టారు. జిల్లాలోని పేదలు, నిరుపేద కుటుంబాలకు, అవసరం ఉన్నవారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వస్త్ర దాన కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా పోలీసులు తరుపున కొత్త, ఉపయోగించిన దుస్తులను వితరణగా అందజేశారు. అని శాఖలు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, ప్రజలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బైతరణిలో మునిగి దంపతులు మృతి
భువనేశ్వర్: బిరజా అమ్మవారి దర్శనం కోసం ఒడిశాలోని జాజ్‌పూర్‌కు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతుల యాత్ర విషాదంగా ముగిసింది. బరహనాథ్ సమీపంలోని బైతరణి నదిలో స్నానానికి వెళ్లిన దంపతులు నీట మునిగి మృతి చెందారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం బిరజా అమ్మవారి దర్శనం అనంతరం బైతరణి నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లింది. సప్తమాతృకా వరాహనాథ్ ప్రాంతంలోని ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా ఇద్దరూ ప్రవాహంలో చిక్కుకున్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న జాజ్‌పూర్ టౌన్ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దంపతులను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని జాజ్‌పూర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని సమాచారం. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం తదితర ప్రక్రియల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.


