రోడ్డు నిర్మించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మించాలని ఆందోళన

Nov 13 2026 12:10 AM | Updated on Nov 13 2026 12:10 AM

రాయగడ: ఏళ్ల తరబడి రహదారి నిర్మాణం కోసం విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌–ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు. రాయగడ జిల్లా కెరడ గ్రామపంచాయతీ పరిధిలోని వందలాది మంది గ్రామస్తులు గురువారం సరిహద్దు రహదారిని దిగ్బంధించారు. దీంతో కెరడ మార్గం మీదుగా సరిహద్దు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తమ గ్రామాలకు పక్కా రహదారులు నిర్మించేంత వరకు ఆందోళన చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.

రెండు రహదారుల నిర్మాణానికి డిమాండ్‌

కెరడ పంచాయతీ పరిధిలోని అనిజా గ్రామం నుంచి ఎంపలవలస గ్రామం మీదుగా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వరకు పక్కా రహదారి నిర్మాంచాలని, అలాగే అనిజా నుంచి ఇస్కాపాలం (బొరహలువ) వరకరు మరో పక్కా రహదారి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ రెండు మార్గాలు నిర్మిస్తేనే సరిహద్దు ప్రాంత గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు.

ఆరు నెలల క్రితం నిలిచిపోయిన రహదారి

ఆరు నెలల క్రితం ఒడిశా ప్రభుత్వం రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు ఈ మార్గంలో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న రాయగడ తహసీల్దార్‌ ప్రియదర్శిని స్వయ్‌ అక్కడికి చేరుకుని నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించడంతో పనులు ఆగిపొయాయని పేర్కొన్నారు. అనంతరం ఒడిశా అధికారులు త్వరలోనే రహదారి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆరు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గత మే, అక్టోబరు నెలల్లో జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపించారు.

అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

ఎంపలవలస గ్రామానికి చెందిన జ్యోతి కిలక మాట్లాడుతూ.. ప్రైవేట్‌ రిసార్ట్‌ల కోసం రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తోందని, తమ గ్రామాల కనీస అవసరమైన రహదారుల నిర్మాణాన్ని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం సామాన్య ప్రజల కోసమా, వ్యాపారుల కోసం పనిచేస్తోందా అని నిలదీశారు. మరో గ్రామస్తుడు కిశోర్‌ జిలకర మాట్లాడుతూ కేవలం మూడు కిలోమీటర్ల సరిహద్దు రహదారి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోతే ఒడిశా ప్రజలు ఆంద్రప్రదేశ్‌ వైపు మొగ్గు చూపకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు.

పోలీసుల చర్చలు..

అధికారుల రాకపై అసంతృప్తి

రహదారి దిగ్బంధం అనంతరం శేశికాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి పోలీసులు ఆందోళన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. అయితే రహదారి నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన హామీ, కార్యాచరణ ప్రకటించే వరకు దిగ్బంధాన్ని విరమించేదిలేదని గ్రామస్తులు తేల్చిచెప్పారు. కెరడ సర్పంచు విజయలక్ష్మీ కలక, మాజీ సర్పంచ్‌ మినారావు హిమిరిక, బలరాం జిలకర తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. రహదారి దిగ్బంధం ప్రారంభమైన గంటకు పైగా గడిచినా చర్చల కోసం ఉన్నతాధికారులు ఎవరూ అక్కడికి చేరుకోలేదు. చివరగా సమితి ఏబీడీఓ కాళీచరణ్‌ నాయక్‌ సంఘటన స్థలానికి చేరుకోవడంతో గ్రామస్తులు తాము చేపట్టిన ఆందోళనను వివరించారు. అనంతరం వినతిపత్రంను ఆయనకు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement