మల్కన్‌గిరి : వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా మల్కన్‌గిరి జిల్లాలో గురువారం జిల్లా యువజన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది మహోత్సవానికి వికసిత్ భారత్ కోసం మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువ సమాజం అనే ప్రధాన అంశాన్ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి నవరంగ్‌పూర్ ఎంపీ బోలభద్ర మాఝి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువతే వికసిత్ భారత్‌కు భవిష్యత్ అని అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి దేశ నిర్మాణం, జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సిగ్ మాడ్కమి మాట్లాడుతూ జిల్లాలో యువతలో చాల ప్రతిభ దాగి ఉందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని తెలిపారు. చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం ద్వారానే బలమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయ్, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కామి, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, జిల్లా క్రీడాధికారి మున్న తురక్ విద్యార్థులు పాల్గొన్నారు.
ముగిసిన యువజన ఉత్సవాలు
పర్లాకిమిడి: నేటి యువత జానపద, ఒడిస్సీ, ఆదివాసీ నృత్యాల పట్ల ఆకర్షితులవుతున్నారని, దీన్ని ప్రవృత్తిగా భావించి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయిలో కీర్తి గడించాలని జిల్లాపరిషత్ ఆదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్ అన్నారు. స్థానిక బిజూ కళ్యాణ మండపంలో గురువారం యువజన ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశం డీసీపీఓ అరుణ్‌కుమార్ త్రిపాఠి, జిల్లా సాంస్కృతిక,యువజన, క్రీడాధికారి త్రినాథ కుమార్ సాహు ఆధ్వర్యంలో జరుగగా, మోహనా, చాందిపుట్, ఆర్.ఉదయగిరి, నువాగడ, గుమ్మ, పర్లాకిమిడి ఉన్నతపాఠశాలల నుంచి విద్యార్థులు లోక సంగీతం, జానపద నృత్యాలు ప్రదర్శించి పలువురి మన్నలను పొందారు. విజేతలకు ఏడీఎం ఫల్గుణి మఝి బహుమతులు అందజేశారు. ఉత్సవాల్లో పెయింటింగ్ పోటీల్లో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి నమితా బోరాడో, రాహుల్ భుయ్యాన్ (వికాస్ విద్యాని కేతన్), బినోద్ మండళ్ (శ్రీరాం హెచ్.యస్.యస్. కాశీనగర్) గెలుపొందగా, జానపద నృత్యాలపోటీలలో పర్లాకిమిడికి చెందిన క్రియేటివ్ ఆర్ట్స్ ప్రథమం పదివేల రూపాయలు గెలుచుకున్నారు. ద్వితీయ బహుమతి వందేమాతరం టాలెంట్ అకాడమీ, రూ.7500లు, తృతీయ బహుమతిని వికాస్ విద్యానికేతన్ గ్రూపు రూ.5వేలు గెలుచుకున్నారు. నక్కడ్ నాటకాల పోటీలలో ప్రథమ బహుమతి సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ రూ.10వేలు, ద్వితీయ మహళా డిగ్రీకళాశాల విద్యార్థులు రూ.7500లు, తృతీయ బహుమతి శ్రీరాం ఉన్నత మాధ్యమిక స్కూల్ విద్యార్థులు రూ.5వేలు గెలుచుకున్నారు.


