వెలిగే దీపం..
● ఒడిశా దీపావళిలో ‘బొడొ బొడువా డక్కొ’ ప్రత్యేకత
● పితృ దేవతలకు ఆహ్వానం
● శ్రీమందిరంలోనూ ఘనంగా వేడుకలు
భువనేశ్వర్: దీపావళి అంటే దేశవ్యాప్తంగా వెలుగుల పండుగ. ఇళ్లన్నీ దీపాలతో మెరిసిపోతాయి. లక్ష్మీ పూజలు జరుగుతాయి. బాణసంచా సందడి కనిపిస్తుంది. కానీ ఒడిశాలో దీపావళికి మరో లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరంపర ఉంది. అదే ‘బొడొ బొడువా డక్కొ’. పితృ దేవతలను తమ ఇంటికి ఆహ్వానించి, పూజించి, మహా ప్రసాదం సమర్పించి.. తిరిగి వారికి వెలుగు చూపిస్తూ వీడ్కోలు పలికే అపురూపమైన సంప్రదాయమిది. దీపావళి రోజున సాయంత్రం ఒడిశాలోని అనేక ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు కౌంరియా కఠొ (జనప పుడకలు) కట్టలను వెలిగిస్తారు. వాటిని చేతుల్లోకి తీసుకుని ఆకాశం వైపు ఎత్తుతూ సంప్రదాయబద్ధంగా పూర్వీకులను స్మరిస్తూ పిలుస్తారు. ఈ ఆచారంలో పితృ దేవతలు ఆరోజు తమ వారిని దర్శించేందుకు భూమికి వస్తారని విశ్వాసం. వారికి నైవేద్యాలు సమర్పించి, ఆశీర్వాదాలు పొందిన అనంతరం తిరిగి పరలోకానికి వెళ్లే మార్గాన్ని వెలుగుతో చూపిస్తున్నామనే భావన ఇందులో అంతర్లీనంగా ఉంది.
చీకటిలో రండి.. వెలుగులో వెళ్లండి
కౌంరియా కఠొలను వెలిగిస్తూ సామూహికంగా పలికే సంప్రదాయ పిలుపు ఈ ఆచారానికి ప్రాణం. దాని భావం సారాంశంగా –‘‘ఓ మా పూర్వీకులారా.. చీకటిలో రండి.. వెలుగులో వెళ్లండి.. మహా ప్రసాదాన్ని స్వీకరించి.. పూరీ జగన్నాథుడి బాయిసీ పహాంచొ (22 మెట్లు) ద్వారా మోక్షాన్ని పొందండి’’ అనే ప్రార్థన. ఇది కేవలం ఒక ఆచారం కాదు. పూర్వీకులపై గౌరవం, వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచే కుటుంబ బంధం, భగవంతుడి అనుగ్రహాన్ని కోరే ఆధ్యాత్మిక భావన. ఈ మూడింటి సమ్మేళనంగా ‘బొడొ బొడువా డక్కొ’ను ఒడియా ప్రజలు భావిస్తారు. దీపావళి సందర్భంగా ఇంటి ప్రాంగణాలను శుభ్రం చేసి, రంగవల్లులు వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కళింగ సముద్రయాన సంప్రదాయానికి ప్రతీకలైన ‘బొయితొ’ (పురాతన పడవ) ఆకారంలో ముగ్గులు వేస్తారు. సాయంత్రం ఇంటి ముందు ఎత్తైన కరక్రు మట్టి ప్రమిదను కట్టి వెలిగిస్తారు. దీనినే ‘ఆకాశ దీపం’గా భావిస్తారు. పితృ దేవతలకు ఇంటి దారి చూపించే వెలుగుకు ఇది ప్రతీక. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి కౌంరియా కఠొ కట్టలను వెలిగించి ఆకాశం వైపు ఎత్తుతారు. ఆ క్షణంలో ఇల్లు మొత్తం పితృ స్మరణతో నిండిపోతుంది.
సాదబలు జ్ఞాపకాలతో ముడిపడి..
ఒడిశా దీపావళి సంప్రదాయాలకు ప్రాచీన సముద్రయాన చరిత్రతోనూ సంబంధం ఉందనే కథనాలు ఉన్నాయి. క్రీ.పూ.350 ప్రాంతంలో కళింగ సాదబలు (వ్యాపార నావికులు) బాలి, జావా, సుమత్రా వంటి దక్షిణాసియా ప్రాంతాలకు సముద్రయానం చేసి, నెలల తర్వాత సంపదతో స్వదేశానికి తిరిగి వచ్చేవారని చెబుతారు. వారి రాకను స్వాగతిస్తూ తీరప్రాంత ప్రజలు మట్టి ప్రమిదలు వెలిగించే వారనే ఒక సంప్రదాయ విశ్వాసం ఉంది. శీతాకాల ఆరంభంలో పెద్ద సంఖ్యలో వచ్చే కీటకాలను దూరంగా ఉంచేందుకు వెలుగులు వెలిగించే వారనే మరో జానపద విశ్వాసం కూడా ప్రచారంలో ఉంది. అలా సముద్రయాన చరిత్ర, వెలుగుల సంప్రదాయం, పితృ స్మరణ.. కాలక్రమంలో ఒడిశా దీపావళి సంస్కృతిలో ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకున్నాయి.
జగన్నాథ క్షేత్రంలోనూ ఆచరణ
పూరీ శ్రీజగన్నాథ క్షేత్రంతోనూ ఈ సంప్రదాయానికి ప్రత్యేక అనుబంధం ఉంది. దీపావళి సందర్భంగా శ్రీమందిరం సింహద్వారం ఎదుట కూడా ‘బొడొ బొడువా డక్కొ’ నిర్వహిస్తారు. జగన్నాథుడు ఒడిశా ప్రజల ఆధ్యాత్మిక జీవనంలో అంతర్భాగం కావడంతో.. పితృ దేవతలను స్మరించడం, వారికి మహా ప్రసాదాన్ని సమర్పించడం, జగన్నాథుడి అనుగ్రహాన్ని కోరడం వంటి విశ్వాసాలు ఈ సంప్రదాయంలో మరింత బలంగా ప్రతిఫలిస్తాయి.


