మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి రాస్‌బేఢ పంచాయతీలో ఒక ఎకరా భూమిలో పండిస్తున్న గంజాయి సాగును కలిమెల పోలీసులు శనివారం ధ్వంసం చేశారు. నిషా నివారణ అభియాన్ ఒడిశా, మిషన్ డ్రగ్స్ ఫ్రీ ఒడిశా లక్ష్యంగా ఒడిశా పోలీసులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా దాడులు చేశారు. దీనిలో భాగంగా 1,000 మొక్కలను ధ్వంసం చేశారు. రానున్న రోజుల్లో జిల్లాను పూర్తిగా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ సాగు విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందన్నారు. అయితే ఈ పంట ఎవరికి చెందినదో తెలుసుకోవాలని తహసీల్దార్‌కు జిల్లా పోలీసు యంత్రాంగం కోరింది.
తుఫాన్ బాధితులకు పరామర్శ
పర్లాకిమిడి: ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ శనివారం గజపతి జిల్లాలో తుపాను, వరద బాధితుల గ్రామాల్లో పర్యటించారు. ఆయన తన పర్యటనలో జిల్లాలో మోహనా, లుహగుడి, తిత్తిలి, మహేంద్రగడ, రామగిరి, జిరంగో, లక్ష్మీపూర్ గ్రామాలు సందర్శించి ఆస్తి, పంటనష్టం, ఇళ్లు పోగొట్టుకున్న వారిని పరామర్శించి వారి వద్దనుంచి వినతులు స్వీకరించారు. ఆయనతో పాటు డీసీసీ అధ్యక్షుడు శంకర్ ప్రధాన్, ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి జాస్మిన్ షేక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎస్.పాపారావు, ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ బి.జనార్ధనరావు, గుసాని సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు అప్సాన శ్రీనివాసరావు, బరంపురం ఎంపీ అభ్యర్థి రస్మిరంజన్‌మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
సురభి ఉత్సవంలో చిన్నారుల ప్రతిభ
● రాష్ట్రస్థాయి సురభికి 37 మంది ఎంపిక
రాయగడ: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా జిల్లాస్థాయి సురభి బాలల ఉత్సవం, ఛాయా పార్లమెంట్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కొలనార ఆదర్శ పాఠశాలలో జిల్లాస్థాయి సురభి బాలల ఉత్సవం నిర్వహించగా, పీఎం శ్రీ జగదంబ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లాస్థాయి ఛాయా పార్లమెంట్ కార్యక్రమం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల్లో జిల్లాలోని వివిధ సమితులకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ
జిల్లాస్థాయి సురభి బాలల ఉత్సవానికి ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దుస్మంత్ కుమార్ మహంతి ముఖ్యవక్తగా హాజరవ్వగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికకలు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా ప్రత్యేక అభివృద్ధి మండలి ఉపాధ్యాక్షురాలు మంజుల మినియాక, జిల్లా అదనపు కలక్టర్ రవీంద్ర నాథ్ కహర్, జిల్లా విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గిరిజన ప్రాబల్యం కలిగిన జిల్లాగా ఉన్నప్పటికీ విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ, సృజనాత్మకత దాగి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారికి తగిన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ఈనెల 11న భువనేశ్వర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సురభి బాలల దినోత్సవానికి జిల్లా నుంచి 37 మంది విద్యార్థులు, రాష్ట్ర ఛాయా పార్లమెంట్ కార్యక్రమానికి ఐదుగురు విద్యార్థులు ప్రాతినిధ్యం వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భజన్‌లాల్ మఝి తెలిపారు.


