భువనేశ్వర్: హైటెక్ మెడికల్ కాలేజీలో 22వ వైట్‌కోట్ – చరక్ శపథ కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతనంగా ప్రవేశం పొందిన ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు వైట్‌కోట్లు అందజేసి స్వాగతం పలికారు. వైద్య విద్యలోకి అడుగుపెట్టే ముందు విద్యార్థులతో చరక్ శపథం చేయించారు. ఈ సందర్భంగా హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి మాట్లాడుతూ.. జీవితంలో క్రమశిక్షణే అసలైన పెట్టుబడి అని అన్నారు. క్రమశిక్షణతో మెలిగే వ్యక్తి ఎలాంటి అసాధ్యాన్నైనా సాధ్యం చేయగలరని పేర్కొన్నారు. విద్యార్థులు హైటెక్‌లో క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవర్చుకుంటే, వారిని మంచి వైద్యులుగా తీర్చిదిద్దే బాధ్యత సంస్థదేనని స్పష్టం చేశారు.
వైద్య విద్యతో పాటు సేవాభావం అవసరం
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్‌మోహన్ దాస్ హాజరయ్యారు. ముఖ్య వక్తగా పాల్గొన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. విద్యార్థులు వైద్య విద్యపై దృష్టి సారించడంతో పాటు రోగులపై సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
శపథం అనంతరం ప్రతి విద్యార్థి పవిత్రత, క్రమశిక్షణ, త్యాగం, సేవా భావంతో వైద్య వృత్తిలో ముందుకు సాగేందుకు ప్రేరణ పొందుతారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం 2020–21 బ్యాచ్‌కు చెందిన 14 మంది ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను హైటెక్ యాజమాన్యం నగదు పురస్కారం, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో హైటెక్ గ్రూప్ మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి, కార్యనిర్వాహక అధ్యక్షుడు రాకేష్ కుమార్ పాణిగ్రాహి, హైటెక్ మెడికల్ కాలేజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ దేవానంద్ మహాపాత్రో, ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ లిసా షఢంగి, మెడికల్ సూపరింటెండెంట్, పరిపాలనా డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సీతారామ్ మహాపాత్రో, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాధామాధవ్ త్రిపాఠి, డాక్టర్ గోపేశ్వర్ ఆచార్యతో పాటు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.


