మిల్లెట్‌ సాగులో రెండోస్థానం హర్షణీయం | - | Sakshi
Sakshi News home page

మిల్లెట్‌ సాగులో రెండోస్థానం హర్షణీయం

Nov 8 2026 5:35 AM | Updated on Nov 8 2026 5:35 AM

రాయగడ: మిల్లెట్‌ సాగులో రాష్ట్రం రెండోస్థానంలో ఉండడం హర్షించదగ్గ విషయమని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్‌ ఆడిటోరియంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాగుల దినోత్సవం శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక శాతం ఆదివాసీ, హరిజనులు నివసిస్తున్న రాష్ట్రంలో రాగుల సాగును ప్రోత్సహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఒకప్పుడు రాగులను ప్రధాన ఆహారంగా ఆదివాసీలు మాత్రమే వినియోగిస్తుండేవారని, అయితే రాగుల్లో పుష్కలంగా లభించే పౌష్టికంతో వీటి వినియోగం పెరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా మిల్లెట్‌ సాగును ప్రోత్సహించడం, పోషకాహార ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. జిల్లా ముఖ్య వ్యవసాయాధికారి నక్షత్ర మోహన్‌ రౌలో మాట్లాడుతూ రాగుల సాగు, ఉత్పత్తి, సేకరణ వివరాలను వెల్లడించారు. జిల్లాలో సుమారు 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రాగుల సాగు జరుగుతోందని తెలిపారు. గతేడాది 6 వేల మెట్రిక్‌ టన్నుల రాగులను సేకరించినట్లు వెల్లడించారు. రాగుల పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ ప్రోటీన్లు, పీచు పదార్థాలు, కాల్షియం, అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా లభించే అద్భుతమైన పోషక ధాన్యమని సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అరవింద్‌ దాస్‌ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతి మాఝి మాట్లాడుతూ రాగుల సాగులో ఆధునిక శాసీ్త్రయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉత్పత్తి, ఉత్పదకతను పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement