పేదలపై వివక్ష ఎందుకు..? | - | Sakshi
Sakshi News home page

పేదలపై వివక్ష ఎందుకు..?

Nov 8 2026 5:35 AM | Updated on Nov 8 2026 5:35 AM

పేదలపై వివక్ష ఎందుకు..?

ఏళ్లుగా మౌలిక సదుపాయాలకు నోచుకోని ఎంపలవలస అవస్థలు పడుతున్న గ్రామస్తులు పట్టించుకోని అధికారులు ప్రైవేటు రిసార్టుకు మాత్రం రూ.కోట్లతో రహదారి నిర్మాణం

రాయగడ:

ప్రభుత్వానికి, అధికారులకు నిధులు ఉపయోగించాలనే సంకల్పం ఉంటే రూ.కోట్లతో రహదారులు నిర్మించడం సాధ్యమేనని, అయితే సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతోందని జిల్లాలోని ఎంపలవలస గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రైవేట్‌ రిసార్ట్‌కు డీఎంఎఫ్‌ నిధుల నుంచి రూ.కోటితో కేవలం మూడు నెలల్లో రహదారి నిర్మించిన అధికారులు, మూడు దశాబ్ధాలుగా డిమాండ్‌ చేస్తున్న తమ గ్రామానికి సుమారు 2.8 కిలోమీటర్ల రహదారి నిర్మించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యాపారి రాయగడ ప్రాంతంలో రిసార్టు నిర్మించడంతో అతడికి తక్షణమే రహదారి సౌకర్యం కల్పించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఎంపలవలస గ్రామంలో రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోగులకు అవస్థలు

గ్రామానికి రహదారి లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా కష్టసాధ్యంగా మారుతున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ కూడా గ్రామానికి చేరుకోలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యాపారుల అవసరాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద ప్రజల ప్రాథమిక అవసరాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. తమ గ్రామానికి రహదారితో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకపోతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ – ఒడిశా రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

గ్రామంలో 40 కుటుంబాల నివాసం

సరిహద్దులో ఉన్న ఎంపలవలస గ్రామంలో సుమారు 40 కుటుంబాలకు చెందిన 155 మంది నివసిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం నాగావళి నదిలో తరచూ వరదల రావడంతో గ్రామం తీవ్ర ప్రభావితమైంది. అప్పట్లో గ్రామస్తులను మరో ప్రాంతానికి తరలించగా.. కాంగ్రెస్‌ మాజీమంత్రి, దివంగత రామచంద్ర ఉలక జోక్యంతో వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రామంలోని చాలా ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో సోలార్‌ ఆధారిత తాగునీటి వ్యవస్థ ఉన్నప్పటికీ వర్షాకాలంలో తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.

చివరి దశలో టెండర్‌..?

ఈ సమస్యపై రాయగడ జిల్లా అదనపు కలక్టర్‌ రవీంద్ర నాథ్‌ కహార్‌ స్పందిస్తూ ఒనిజా వైపు వెళ్లే 2.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ చివరి దశలో ఉందని తెలిపారు. త్వరలో టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే ప్రైవేట్‌ రిసార్ట్‌కు రూ.కోట్లతో రహదారి నిర్మాణం సాధ్యమైనప్పుడు.. తమలాంటి పేదలు నివసించే గ్రామానికి రహదారి నిర్మించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement