● రైళ్లలో అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృత చర్యలు
భువనేశ్వర్: దీపావళి నేపథ్యంలో రైళ్లలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రత్యేక భద్రతా తనిఖీలు చేపట్టింది. ఈ నెల 18వ తేదీ వరకు ఖుర్దా రోడ్, సంబల్‌పూర్, రాయగడ డివిజన్ల పరిధిలో ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులు ఇందులో పాల్గొంటున్నారు. అగ్ని ప్రమాదాలకు కారణం అయ్యే పరిస్థితులను ముందుగానే గుర్తించడం, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండేలా చూడటం, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో తనిఖీ చేయడం, ప్రయాణికులు–రైల్వే సిబ్బందిలో అగ్ని భద్రతపై అవగాహన కల్పించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.
ప్రమాదకర వస్తువులపై నిఘా
ప్రయాణికులు రైళ్లలో బాణసంచా, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, కిరోసిన్, యాసిడ్ తదితర మండే, ప్రమాదకర పదార్థాలను తీసుకెళ్లవద్దని రైల్వే అధికారులు హెచ్చరించారు. రైళ్లలో నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం రైల్వే చట్టం–1989 ప్రకారం శిక్షార్హమైన నేరమని తెలిపారు. నేరం రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అనుమానాస్పద సామగ్రి లేదా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని లేదా 139 రైల్వే సహాయవాణికి ఫోన్ చేయాలని ప్రయాణికులకు సూచించారు.
లగేజీ, పార్సిళ్లపై ఆకస్మిక తనిఖీలు
రైల్వే అధికారులు రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీసుల సహకారంతో రైళ్లలోని లగేజీ, పార్సిళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారు. ముఖ్యంగా రైళ్లలోని సామగ్రి బోగీల్లోకి ఎక్కించే ముందు తనిఖీలు నిర్వహిస్తారు. స్టేషన్లు, రైలు బోగీలు, ఆహారశాల బోగీలు, విద్యుత్ బోగీలు, ఇంజిన్లలో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అవి సక్రమంగా పనిచేస్తున్నాయా? అన్నది పరిశీలిస్తారు. పొగ, అగ్నిని గుర్తించే వ్యవస్థల పనితీరును కూడా తనిఖీ చేయనున్నారు.
విద్యుత్ వైరింగ్‌పై ప్రత్యేక దృష్టి
రైలు బోగీలు, ఆహారశాల బోగీల్లోని విద్యుత్ వైరింగ్, భద్రతా వ్యవస్థలను పరిశీలించి వదులుగా ఉన్న తీగలు, ఇతర ప్రమాదకర పరిస్థితులను గుర్తించనున్నారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చార్జ్ చేసే విద్యుత్ సాకెట్లను హీటర్లు లేదా ఇతర విద్యుత్ పరికరాల కోసం ఉపయోగించవద్దని ప్రయాణికులను హెచ్చరించారు. బోగీల్లోని ప్రయాణ మార్గాలు, మధ్యదారులు, తలుపుల వద్ద ఎలాంటి వస్తువులతోనూ అడ్డంకులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ‘ధూమపానం నిషేధం’ సూచికలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
సిబ్బందికి అవగాహన
ఆహారశాల బోగీల సిబ్బంది, కాంట్రాక్టు కార్మికులకు అగ్ని ప్రమాదాల నివారణ, అగ్నిమాపక పరికరాల వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. ప్రయాణికులకు కూడా అగ్ని భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు స్టేషన్లు, రైళ్లలో భద్రతా సూచికలు, కరపత్రాలు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నారు.
రైళ్లపై నిరంతర నిఘా
స్టేషన్ సిబ్బంది, క్యాబిన్ సిబ్బంది, గేట్‌మెన్లు, రైళ్ల విధుల్లో ఉండే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు ఆదేశించారు. ప్రయాణిస్తున్న రైళ్లలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించినా, పొగ లేదా ఇతర ప్రమాద సంకేతాలు కనిపించినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీపావళి సందర్భంగా రైళ్లలో అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించడంతోపాటు, ప్రయాణికులకు సురక్షితమైన రైలు ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రత్యేక భద్రతా తనిఖీల లక్ష్యమని ఈస్ట్‌కోస్ట్ రైల్వే తెలిపింది.


