● కొఠియాలో తాడోపేడో తేల్చుకుంటామన్న అఖిల పక్షం ● పోలింగ్ రోజు కొఠియాలో రాజకీయ పక్షాల మోహరింపు
కొరాపుట్: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కొఠియా ప్రాంత సమస్య పరిష్కారంపై ఉన్న శ్రద్ధ ప్రస్తుత ప్రభుత్వాలకు లేదని ప్రతిపక్ష బీజేడీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్, మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి ప్రకటించారు. రాజధాని భువనేశ్వర్‌లో బీజేడీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేడీ నాయకుడు అరుణ్ సాహుతో కలసి ప్రసంగించారు. నాడు ఒడిశాతో ఆంధ్ర కి ఉన్న సరిహద్దు సమస్యలు నేరడి బ్యారేజి, పోలవరం, కొఠియా ఉన్నాయన్నారు. నాడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన వెంటనే ఒడిశా వచ్చి నాటి ముఖ్య మంత్రి నవీన్‌పట్నయక్‌తో విస్తృత చర్చలు జరిపారన్నారు. 2021 నవంబర్ 21న రెండు రాష్ట్రాల సీఎంలు జరిపిన చర్చలు చారిత్రాత్మకమైనవన్నారు. నవీన్–జగన్‌కి కొఠియా సమస్య పరిష్కారం పై ఉన్న శ్రద్ధ నేటి ముఖ్యమంత్రులకు లేదన్నారు. ఇద్దరు సీఎంలకు ఇంత వరకు ఎన్ని సార్లు సమావేశం అయ్యారని ప్రశ్నించారు. ఇంత వరకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు తో చర్చలు జరపడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ఇటీవల ఇద్దరు సీఎంలు ముంబైలో ఒక సమావేశంలో పాల్గొన్నా వారిద్దరికీ సమయం లేక పోయిందన్నారు. బీజేపీ ప్రస్తుతం చంద్రబాబు చర్యలను అడ్డుకోలేక పోతుందన్నారు. కొఠియాలో నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వలేదని తన పర్యటన లో గిరిజనులు పేర్కొన్నారన్నారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఇంకా నాలుగు రోజులు మాత్రమే పోలింగ్‌కి సమయం ఉందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికే అక్కడ పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. కానీ ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు. బీజేపీ నాయకులు కేవలం ప్రకటన లకే పరిమితం అయ్యారని ప్రదిప్ మజ్జి పేర్కొన్నారు.
కొఠియా అఖిల పక్ష సమావేశం
కొఠియా పై తాడో పేడో తేల్చుకోవాలని ఒడియా అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యవాన్ మహాజన్ నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో ఇంత వరకు జిల్లా అధికార యంత్రాంగం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో చేసిన అభివృద్ధిని వివరించారు. అంతేకాక ఆంధ్రా ప్రభుత్వాన్ని అడ్డుకున్న వివరాలు కలెక్టర్ వివరించారు. ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్లినా రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రని అడ్డుకోవడానికి ముందుకు వెళ్లడానికి రాజకీయా పార్టీల నాయకులు సంయుక్త ప్రకటన చేశారు. ఆంధ్ర పోలీంగ్ నిర్వహించిన రోజు కొఠియా లో ప్రతి గ్రామాన పోలీసులు మోహరించి ఒడిశా వాసులు ఓటింగ్ వెళ్లకుండా నిలువరించనున్నారు. ఆంధ్ర నుంచి పోలీంగ్ కోసం ఎవరూ వచ్చినా అడ్డుకోవడానికి సంయుక్తంగా రాజకీయ పక్షాలు మోహరించనున్నారు.ఒడిశాలో ఆంధ్ర పోలింగ్ అడ్డుకోవడానికి తాడో పెడో తేల్చుకుంటామని పేర్కొన్నారు. సమావేశం అనంతరం జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీనీ పతి మీడియా తో మాట్లాడారు. ఎవరైనా ఆంధ్రా లో ఓటు వేయాలనుకుంటే వారు ఒడిశా ప్రభుత్వ పథకాలు పొందలేరన్నారు.
కొఠియా పై ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి
కొఠియా ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న గనులు దోచుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదన్నారు. త్రిపుల్ ఇంజన్ బీజేపి సర్కార్ మౌన ముద్ర కారణాలు ప్రజలు తెలుసు కోవాలనుకుంటున్నారని భక్త చరణ్ పేర్కొన్నారు. మరో వైపు ప్రతిపక్ష బీజేడి కి చెందిన మాజీ మంత్రి రబినారాయణ నందో నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. కొఠియా ప్రాంతంలో తుపాన్ బాధితుల సహాయార్థం సబ్ కలెక్టర్ ఫాబీ రషిద్ కొఠియా లో మకాం వేశారు. అక్కడ బాధిత గ్రామాలను సందర్శించారు.


