● నిందితుల బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు
రాయగడ: ఆదివాసీ యువ నాయకుడు భగీరథి మండంగి హత్య కేసులో నిందితులుగా పరిగణించిన వారికి సుప్రీం కోర్టుకులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సుప్రీం రద్దు చేసింది. నిందితులను రెండు వారాల్లో ఎస్‌డీజేఎం కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. 2010లో యువ ఆదివాసీ నాయకుడు భగీరథి మండంగి హత్యకు గురైన ఘటనకు సంబంధించి అప్పట్లో కేసు నమోదైంది. ఈ హత్యలో రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావుతో పాటు మరో ఆరుగురుకి సంబంధం ఉందని మృతుడి కుటుంబీకులు, సోదరుడు జగన్నాథ మండంగి ఆరోపిస్తూ వచ్చారు. నెక్కంటిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు రాయగడలో పలుసార్లు ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ కేసు ఎస్‌డీజేఎం కోర్టులో విచారణలో ఉండగా నెక్కంటితోపాటు మరో ఆరుగురు నిందితులపై న్యాయస్థానం నాన్‌బెయిలెబుల్ ఆరెస్టు వారెంట్లను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టను ఆశ్రయించగా ముందస్తు బెయిల్ మంజూరైంది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ మృతుడు భగీరథి సొదరుడు జగన్నాథ మండంగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించి హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితులను రెండు వారాల్లోగా ఎస్‌డీజేఎం కోర్టులో హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై ఆదివాసీ మహాసంఘం గురువారం స్థానిక హోటల్ కై లాస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ సంఘం నాయకుడు బసంత ఉలక మాట్లాడారు. గత ప్రభుత్వ హాయంలో పలుకుబడిని ఉపయోగించి ఈ ఘటనను 16 ఏళ్లపాటు మరుగున పడేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో నిందితులను కోర్టులో లొంగిపోవడం మినహా మరోమార్గం లేదన్నారు. ఈ సమావేశంలో జగన్నాథ మండంగి, భాష మండంగి, తదితరులు పాల్గొన్నారు.


