రాయగడ: పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మూడు కీలక డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పొరిడకు మున్సిపాలిటీ కౌన్సిలర్‌లు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో అభివృద్ధి పనులు జావుగా అమలు చేసేందుకు వెంటనే జూనియర్ ఇంజినీర్ (జేఈ)ను నియమించాలని కోరారు. ఇంజినీర్ లేకపోవడంతో అభవృద్ధి పనుల అమలులో ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాయగడ ప్రభుత్వ హాస్పిటల్‌లో రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సరిపడ వైద్యులను నియమించాలని వినతిపత్రంలో వివరించారు. పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడానికి అదనంగా మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ శ్రమిత పాడీ, కౌన్సిలర్‌లు సంతోష్ దొళాయి, గోపీనాథ్ గౌడో, తదితరులు పాల్గొన్నారు.
గంజాంలో సహాయక చర్యలు
భువనేశ్వర్: అర్నబ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల ఒడిశాలోని గంజాం జిల్లాలో జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన ప్రజలను హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు భారత తీర రక్షక దళం (ఐసీజీ) గురువారం సహాయక చర్యలను ప్రారంభించింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 300లకు పైగా గ్రామాలు జలమయమయ్యాయి. గంజాం జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు కోస్ట్ గార్డ్ ఒక హెలికాప్టర్‌ను పంపించిందని ప్రత్యేక సహాయక కమిషనర్ కార్యాలయం తెలిపింది.
కోళ్ల వ్యాన్ బోల్తా
ఎచ్చెర్ల : ఽదర్మవరం సమీపంలో తుఫాన్ వర్షాల ధాటికి ఇసుక చెరువు నిండిపోవడంతో గురువారం రోడ్డుపైకి నీరు ప్రవహించింది. ఆ సమయంలో ధర్మవరం వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. వరదనీటిలో చిక్కుకుని చాలా కోళ్లు చనిపోయాయి. వ్యాన్‌డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ బి.గోపాల్, ఎస్సై లక్ష్మణరావు, సిబ్బంది చేరుకుని ప్రొక్లెయిన్ సహాయంతో వ్యాన్‌ను బయటకు తీశారు. రోడ్డుపైకి వరద నీరు ప్రవహించే చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పలాసలో రూ.3 వేలు..
కాశీబుగ్గలో రూ.5 వేలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ పురపాలక ఓట్ల పండగకు సమయం దగ్గరపడింది. దీంతో కూటమి ఆఖరి అస్త్రాన్ని బయటకు తీసింది. 36 వార్డుల్లో విజయావకాశాలు అంతంతమాత్రమే అన్న ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో ఓటర్లపై నోట్ల వర్షం కురిపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు జంట పట్టణ ఓటర్లను రెండుగా విభజించి ఓటుకు రేటు నిర్ణయించారు. కాశీబుగ్గలో టీడీపీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఒక్కో ఓటరుకు రూ. 5వేలు వరకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాశీబుగ్గలో టీడీపీ అభ్యర్థి భర్తపై వ్యాపారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలాసలో కార్మిక వర్గం ఎక్కువగా ఉండడంతో వీరికి రూ.3వేలు చాల్లే అనే నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగా నగదు చేరవేసేలా ఇప్పటికే కార్యాచరణను అమలు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. గురువారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో బృందాలు రంగంలోకి దిగాయి. వార్డుల్లో వీధికి ఒకరు చొప్పున నమ్మకస్తులైన అనుచరులతో పంపిణీ చేపట్టినట్లు సమాచారం. పలకరింపుల ముసుగులో డబ్బులు చిలకరిస్తున్నారు. కానీ అభ్యర్థి పైస్థాయి నుంచి భారీగానే నిధులు విడుదల చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే బృందాల సభ్యులు అందులో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘దక్కత’కు దక్కలేదు
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం ఎంపీపీని ఆశించిన దక్కత ఏకాంబరీదేవికి టీడీపీ మొండి చేయి చూపింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం నుంచి ముగ్గురు జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీపడగా, ఏకాంబరీదేవి నామినేషన్ వేసి ప్రచారం కూడా చేశారు. కానీ ఆఖరుకు జనసేన తరఫున ఇదివరకు పోటీ చేసి ఓడిపోయిన తిప్పన నీలవేణి పేరును ఖరారు చేయడంతో ఏకాంబరీదేవికి నిరాశ తప్పలేదు. అటు ఎంపీటీసీ లేదు, ఎంపీపీ లేదు, చివరకు జెడ్పీటీసీ కూడా దక్కని పరిస్థితి ఏకాంబరీదేవికి ఎదురైందని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


