ప్రాణనష్టం సున్నా | - | Sakshi
Sakshi News home page

ప్రాణనష్టం సున్నా

Oct 30 2026 7:00 AM | Updated on Oct 30 2026 7:00 AM

● సీఎం మాఝీ

అధికార యంత్రాంగం సహాయక చర్యలు

భువనేశ్వర్‌: అర్నబ్‌ తుఫాన్‌ సమయంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, తద్వారా ఒడిశా తన ’జీరో క్యాజువాలిటీ’ లక్ష్యాన్ని సాధించిందని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ తెలిపారు. ప్రత్యేక సహాయ కమిషనర్‌ (ఎస్‌ఆర్‌ిసీ) కంట్రోల్‌ రూమ్‌లో తుఫాన్‌ పరిస్థితిని సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన సన్నాహాలు చేసిందని, తద్వారా పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి యంత్రాంగానికి వీలు కలుగుతుందని మాఝీ అన్నారు.

ఒడిశాకు అన్ని విధాలా సహాయం అందిస్తాం: అమిత్‌ షా హామీ

రాష్ట్రంలో అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా తలెత్తిన పరిస్థితిపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో మాట్లాడారు. ఒడిశా వ్యాప్తంగా అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం, ప్రభావిత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ, పునరుద్ధరణ చర్యల గురించి తాను కేంద్ర హోం మంత్రికి వివరించినట్లు సీఎం మాఝీ తెలిపారు. అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఒడిశాకు సాధ్యమైన అన్ని విధాలా సహాయం అందిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చినట్లు తెలిపారు. సన్నద్ధతా చర్యలను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తుఫాన్‌కు ముందు, తుఫాన్‌ సమయంలో తనతో పలుమార్లు మాట్లాడారని ముఖ్యమంత్రి తెలిపారు. ఒడిశా ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది.

అర్నబ్‌ తుఫాన్‌ రికార్డు స్థాయి వర్షపాతం

ఒడిశా రాష్ట్ర సహాయక కమిషనర్‌ (ఎస్‌ఆర్‌సీ) సమాచారం ప్రకారం, అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో గత 24 గంటల్లో ఒడిశా వ్యాప్తంగా అత్యంత భారీగా వర్షాలు కురిశాయి. గంజాం జిల్లాలోని పాత్రపూర్‌లో గురు వారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా 546 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంధమల్‌ జిల్లా జి. ఉదయగిరిలో 462.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, సన్నొఖేముండి, రైకియా మరియు సొరడలలో వరుసగా 388 మిల్లీ మీటర్లు, 384.8 మిల్లీ మీటర్లు మరియు 375 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. తీవ్రంగా ప్రభావితమైన ఇతర ప్రాంతాలలో గంజాంలోని చికీటిలో 309.2 మిల్లీ మీటర్లు గజపతిలోని మోహనలో 307.6 మిల్లీ మీటర్లు, మరియు కంధమల్‌లోని దారింగ్‌బడి, చొక్కపొడాలో వరుసగా 273 మిల్లీ మీటర్లు, 249 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. దక్షిణ ఒడిశా, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ చత్తీస్‌గఢ్‌ సమీపంలో ఈ వ్యవస్థ బలహీనపడి అల్పపీడనంగా మారినప్పటికీ, గంజాం, గజపతి మరియు కంధమల్‌ జిల్లాల్లో కురిసిన అత్యంత భారీ వర్షాల కారణంగా వరద లాంటి పరిస్థితులు, కొండచరియలు విరిగిపడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా 17 మండలాల్లో 105 మిల్లీమీటర్లకు మించిన వర్షపాతం నమోదైంది. కొరాపుట్‌ జిల్లాలోని పొట్టంగిలో అత్యధికంగా 188 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత గజపతి జిల్లాలోని మోహనలో 182.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం పరంగా గజపతి జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైందని ఆయన అన్నారు. అత్యవసర ప్రతిస్పందన కోసం 60 ఒడిశా విపత్తు త్వరిత కార్యాచరణ దళం (ఓడీఆర్‌ఏఎఫ్‌) బృందాలు, తొమ్మిది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌ డీఆర్‌ఎఫ్‌) బృందాలు మరియు 244 అగ్నిమాపక సేవా బృందాలతో కూడిన మొత్తం 313 ప్రతిస్పందన బృందాలను మోహరించారు. మల్కన్‌గిరి, కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌, రాయగడ, కలహండి, గంజాం, గజపతి మరియు నువాపడా అనే ఎనిమిది జిల్లాల్లోని 634 సహాయక శిబిరాలకు మొత్తం 43,827 మందిని తరలించారు. ఈ శిబిరాలలో వండిన ఆహారం, పొడి రేషన్లు, తాగునీరు, మందులు మరియు ఇతర నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు.

తుఫాన్‌ సన్నద్ధతా చర్యల్లో భాగంగా 2,245 మంది గర్భిణులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించగా, అక్కడ 931 మంది శిశువులు సురక్షితంగా జన్మించి బాలింతలతో క్షేమంగా ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. చాలా మంది తల్లిదండ్రులు తమ నవజాత శిశువులకు తుఫాన్‌ పేరు పెట్టారని అధికారులు తెలిపారు. అబ్బాయిలకు అర్నాబ్‌, తూఫాన్‌, పవన్‌ అని, అమ్మాయిలకు బర్షా, బటాసి అని పేర్లు పెట్టారు. ఒక్క గంజాంలోనే అక్టోబర్‌ 25 నుంచి 493 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించినట్లు సీడీఎంఓ ఎస్‌. కామేశ్వరరావు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలోపే 220 మందికి ప్రసవాలు జరిగాయని, వీరిలో 101 మంది బాలురు, 119 మంది బాలికలు ఉన్నారని, వారందరూ క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు.

సముద్రం నుంచి మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వచ్చేలా ప్రభుత్వం కూడా నిర్ధారించింది. గంజాం నుంచి బాలాసోర్‌ వరకు సముద్రంలోకి వెళ్లిన మొత్తం 19,143 పడవలు సురక్షితంగా తిరిగి వచ్చాయని, ఈ ఆపరేషన్‌లో 100 శాతం విజయం సాధించామని మాఝీ తెలిపారు. ప్రతిస్పందన చర్యలను సమన్వయం చేసేందుకు వివిధ జిల్లాలకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, ఆరుగురు మంత్రులు, ఏడుగురు ఐఏఎస్‌ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. నీటిని తోడివేయడానికి తగినన్ని పంపింగ్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అంతకుముందు, ఎస్‌ఆర్సీ రాజేష్‌ ప్రభాకర్‌ పాటిల్‌ తుఫాన్‌ పరిస్థితి మరియు ఒడిశాపై దాని ప్రభావం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. వర్షపాతం, నష్టం, నదీ జలాల మట్టాలు, సహాయక శిబిరాల ఏర్పాట్లను సమీక్షించడానికి మాఝీ వివిధ జిల్లాల ఉప ముఖ్యమంత్రులు మరియు మంత్రులతో కూడా సంభాషించారు. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ పూజారి, రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అరబింద కుమార్‌ పాఢి, సీనియర్‌ ఎస్‌ఆర్‌సీ కార్యాలయ అధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

వరద నీటిలో గ్రామాలు

పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి బాగుసల, బాపూజీపేట గ్రామాల్లో వరదనీరు చేరి పలు వీధులు మునిగిపోయాయి. దీంతో హుటాహుటిన ఓడ్రాఫ్‌ బృందం విచ్చేసి సహాయక చర్యలు చేపట్టింది. బాగుసల వాసులను గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారం, తాగునీరు అందజేశారు. బాగుసల గ్రామంలో జిల్లా కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌ పర్యటించారు. గ్రామస్తులకు 50 పడకల ఎస్సీ, ఎస్టీ నివాసగృహానికి తరలించాలని గుసాని బీడీఓ గౌరచంద్ర పట్నాయక్‌ను ఆదేశించారు. సబ్‌ కలెక్టర్‌ భాగవత్‌ సామల్‌ కల్యాణ్‌రావ్‌, తహసీల్దార్‌ నారాయణ బెహరా, ఇతర అధికారులు పర్యటించారు. బాగుసల, బాపూజీపేట, భిన్నల గ్రామలకు విచ్చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. గంట తరువాత గ్రామంలోని వరద నీరు పక్కన ఉన్న మహేంద్రతనయ నదిలోకి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement