● అర్నబ్ తుపాను వేళ ప్రత్యేకంగా కనిపించిన దృశ్యం ● జగన్నాథుడి రక్షణగా భక్తుల విశ్వాసం
భువనేశ్వర్: బంగాళా ఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచిన వేళ ఒడిశాలోని పూరీ శ్రీజగన్నాథ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం కనిపించింది. ఆలయ శిఖరంపై రెపరెపలాడే పవిత్ర పతితపావన పతాకంలో ‘శూన్య గంఠి’ (ముడి) ఏర్పడింది. అదే సమయంలో నీలచక్రానికి భక్తులు మొక్కులుగా కట్టిన వందలాది చిన్న జెండాలు గాలుల ధాటికి తెగిపోయి, ఆలయ శిఖరంపై ఉన్న దధినౌతి భాగంలో పడిపోయాయి.
ఏమిటీ శూన్య గంఠి?
పతితపావన పతాకంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జెండాలు గాలుల ప్రభావంతో ఒకదానితో మరొకటి చిక్కుకుని ముడి పడటాన్ని ‘శూన్య గంఠి’ లేదా ‘బ్రహ్మ గంఠి’గా పిలుస్తారని ఆలయ సంప్రదాయాలపై అవగాహన ఉన్న సేవాయతులు చెబుతున్నారు. సాధారణంగా బలమైన గాలులు వీచే సమయంలో ఇలాంటి ముడులు ఏర్పడే అవకాశం ఉంటుంది. గతంలో 51 లేదా 150 మూరల పొడవైన పెద్ద జెండాలను ఎగురవేసే రోజుల్లో ఇలాంటి ముడులు తరచుగా కనిపించేవని, ప్రస్తుతం జెండాల పొడవు తగ్గడంతో ఈ దృశ్యం అరుదుగా మారిందని ఒక సేవాయత్ వర్గాల సమాచారం.
జగన్నాథుడి రక్షణగా భక్తుల నమ్మకం
శూన్య గంఠి ఏర్పడటాన్ని భక్తులు శుభసూచకంగా భావిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆపదలు తొలగి ప్రజలకు రక్షణ లభిస్తుందనేది వారి విశ్వాసం. అర్నబ్ తుపాను నేపథ్యంలో ఈ దృశ్యం కనిపించడంతో పలువురు భక్తులు జగన్నాథుడే తమను కాపాడతాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే, శూన్య గంఠి ఏర్పడటం వల్ల తుపాను బలహీనపడుతుందనే విషయానికి శాసీ్త్రయ ఆధారాలు లేవు. తుపాను తీవ్రత, దాని గమనం, వర్షపాతం వంటి అంశాలను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించే అధికారిక సమాచారంతోనే అంచనా వేయాలి.
వాతావరణం అనుకూలించాక కొత్త జెండా
తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పతితపావన పతాకం తొలగించి, కొత్త జెండాను ఎగురవేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత చునారా సేవాయతులు ఆలయ శిఖరంపైకి వెళ్లనున్నట్లు శ్రీజగన్నాథ ఆలయ పాలక మండలి (ఎస్‌జేటీఏ) వర్గాలు పేర్కొన్నాయి.


