రాయగడ: ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా నిలుస్తుందని మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రాంత్ బురియా స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సందేశంతో రాయగడకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక సబ్ జైలులో ఉన్న డాక్టర్ రాండెల్ సికేరాను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీలు, దళితుల జల, జంగల్, జమీన్ హక్కుల పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. నియమగిరి నుంచి ప్రారంభమైన హక్కుల పోరాటం ప్రస్తుతం సిజిమాలి ప్రాంతంలోనూ కొనసాగుతోందన్నారు. కాసీపూర్‌లోని కంటమాల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పోలీసు క్యాంప్‌ను తొలగించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ అణిచివేత విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వెల్లడించారు. అనంతరం జైలు వెలుపల రాండెల్ సికేరా తల్లిదండ్రులను కలుసుకున్నారు. ఆయనతో పాటు రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, రాష్ట్ర ఆదివాసీ సెల్ అధ్యక్షుడు యశ్వంత్ సింగ్, ఛత్తీస్‌ఘడ్ ఎమ్మెల్యే జనరామ్ ధ్రువ్, ఆ రాష్ట్ర ఆదివాసీ సెల్ అధ్యక్షుడు గణేష్ సింగ్ ధ్రువ్ తదితరులు పాల్గొన్నారు.


