రాయగడ: జిల్లాకు చెందిన వలస కార్మికుల మరణాలు ఆగడం లేదు. పొట్టకూటి కోసం వలస వెళ్తున్నవారు విగతజీవులుగా స్వగ్రామాలకు చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఖనిజ సంపదలకు నిలయమైన ఈ జిల్లాలో ఎన్నో బృహత్తర పరిశ్రమలు ఉన్నప్పటికీ.. యువతకు ఉపాధి లభించకపోవడంతో తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నవారు మృత్యువాత పడుతుండడం పరిపాటిగా మారింది. తాజాగా జిల్లాలోని కాసీపూర్ సమితి సిరపాయి పంచాయతీలోని లెలిగుమ్మ గ్రామానికి చెందిన పాయికొ మాఝి (26) అనే యువకుడు తమ కుటుంబ పోషణ కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు పనికోసం వెళ్లాడు. అక్కడ ఒక ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. విధుల్లో భాగంగా బుధవారం అతని శరీరంపై కెమికల్ పడిపోవడంతో తీవ్రగాయాలకు గురై మృతి చెందాడు. గురువారం అతని మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


