8 జిల్లాలకు మంత్రులు | - | Sakshi
Sakshi News home page

8 జిల్లాలకు మంత్రులు

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

● 3,000 మందికి పైగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ● రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లు ● బీచ్‌లు, పడవ సర్వీసులు బంద్‌

న్యూస్‌రీల్‌

అర్నబ్‌ ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు

మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
అర్నబ్‌ తుఫాన్‌ ముప్పు..
● 3,000 మందికి పైగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ● రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లు ● బీచ్‌లు, పడవ సర్వీసులు బంద్‌

భువనేశ్వర్‌:

అర్నబ్‌ తుఫాన్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్టోబర్‌ 28న ఒడిశా–ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని సమీపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. ఎనిమిది జిల్లాల్లో సన్నద్ధతను పర్యవేక్షించేందుకు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులను నియమించగా.. 3,000 మందికి పైగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. సముద్ర తీరాల్లో పర్యాటకుల భద్రత దృష్ట్యా బీచ్‌లను మూసివేయడంతోపాటు చిలికా సరస్సులో పడవ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.

3,000 మందికి పైగా గర్భిణుల తరలింపు

తుఫాన్‌ సన్నద్ధతపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. కేబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) సమావేశంలో ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్‌ రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివరించారు. దక్షిణ ఒడిశాలో తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యవేక్షణ, సహాయక చర్యల కోసం సీనియర్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు. విద్యుత్‌, జలవనరుల శాఖలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ తుఫాన్‌ ప్రభావానికి ముందే 3,000 మందికి పైగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మత్స్యకారుల భద్రత కోసం కోస్ట్‌గార్డ్‌, రాష్ట్ర యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టాయి. సముద్రంలో ఉన్న మత్స్యకారులు ఒడ్డుకు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. తుఫాన్‌ తీరం దాటిన అనంతరం చత్తీస్‌గఢ్‌ వైపు కదిలి, బస్తర్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్యామ్‌ల నీటి నిర్వహణపై చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయాల్సి వస్తే ఒడిశాకు ముందుగానే సమాచారం అందేలా రెండు రాష్ట్రాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేబినెట్‌ కార్యదర్శి హామీ ఇచ్చారు.

24 గంటల కంట్రోల్‌ రూమ్‌లు

తుఫాన్‌ విపత్తు నిర్వహణలో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో 24 గంటల నియంత్రణ గదులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ పూజారి సోమవారం తెలిపారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదుకావచ్చని పేర్కొన్నారు. తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకినా ఒడిశాపై ప్రభావం ఉంటుందని, మల్కన్‌గిరి అత్యంత ప్రభావిత జిల్లాల్లో ఒకటిగా ఉండవచ్చని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో కురిసే వర్షాల కారణంగా మహానది నీటిమట్టం పెరిగే అవకాశంపైనా మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

గంజాం జిల్లాలో బీచ్‌లు మూసివేత

తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో గంజాం జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అన్ని సముద్ర తీరాలను అక్టోబర్‌ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్‌ 30 ఉదయం 10 గంటల వరకు తాత్కాలికంగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గోపాల్‌పూర్‌, సోనాపూర్‌ తదితర ప్రముఖ పర్యాటక బీచ్‌లతోపాటు జిల్లాలోని అన్ని ఇతర సముద్ర తీరాలకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయని కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయం స్పష్టం చేసింది.

చిలికాలో పడవ సర్వీసులు నిలిపివేత

తుఫాన్‌ ప్రభావంతో సముద్ర పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున చిలికా సరస్సులో ఫెర్రీ, పర్యాటక పడవ సర్వీసులను అక్టోబర్‌ 29 వరకు నిలిపివేస్తున్నట్లు పూరీ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. బొరొకుల్‌, బలుగాంవ్‌, మంగళజోడి, సత్తొపొడ తదితర ప్రాంతాల్లోని జెట్టీల నుంచి నడిచే పర్యాటక పడవలతోపాటు గంజాం జిల్లాలోని జొహ్నికుదా నుంచి పూరీ జిల్లాలోని సత్తొపొడ మధ్య నడిచే ఫెర్రీ సర్వీసులపైనా ఈ ఆంక్షలు అమలవుతాయి. చిలికా సరస్సులోని వివిధ జెట్టీల నుంచి రోజూ పెద్ద సంఖ్యలో పడవలు రాకపోకలు సాగిస్తుంటాయి. పక్షుల వీక్షణ, డాల్ఫిన్ల సందర్శన, కాళిజై ఆలయ దర్శనం కోసం పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలను కఠినతరం చేశారు. ఆంక్షలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు, సంబంధిత బ్లాక్‌ అభివద్ధి అధికారులు (బీడీఓలు), తహసీల్దార్లను ఆదేశించారు.

సముద్రంలోకి వెళ్లొద్దు

తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే ఒడ్డుకు తిరిగి రావాలని కోరింది. చేపల వేటపై ఆంక్షలు అక్టోబర్‌ 29 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. ప్రజల ప్రాణరక్షణ, అత్యవసర సేవల నిర్వహణ, శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ ఒడిశా యంత్రాంగం తుఫాన్‌ సన్నద్ధత చర్యలను కొనసాగిస్తోంది.

మల్కన్‌గిరి : అర్నబ్‌ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు మల్కన్‌గిరి జిల్లా యంత్రాంగం విస్తత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట విపత్తు దళం బృందాలను రంగంలోకి దించింది. వారిలో 30 మందిని కలిమెల సమితి, 36 మందికి మత్తిలి సమితికి పంపించారు. 29 వరకు బడులకు సెలవులు ఇచ్చినట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement