కొఠియాపై పట్టు బిగిస్తున్న ఒడిశా | - | Sakshi
Sakshi News home page

కొఠియాపై పట్టు బిగిస్తున్న ఒడిశా

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

● ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో నిఘా

● అభివృద్ధి, న్యాయపోరాటానికి పదును

భువనేశ్వర్‌: దశాబ్దాలుగా కొనసాగుతున్న కొఠియా సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి రావడంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయం నేపథ్యంలో, కొఠియాలో తన పరిపాలనా ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులను అక్కడ నియమించి, పరిణామాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు న్యాయపరమైన మార్గాలను కూడా అన్వేషిస్తోంది.

రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ పూజారి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు శాఖల నుంచి ఒక్కో అధికారిని కొఠియాలో నియమించి, అక్కడి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్‌ చేపడుతున్న కార్యకలాపాలు, ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోనున్నారు.

సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధం

కొఠియాపై ఒడిశా హక్కులను పరిరక్షించేందుకు సుప్రీం కోర్టులో అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి సురేష్‌ పూజారి వెల్లడించారు. గతంలో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను పునరుద్ధరించడం లేదా అవసరమైతే కొత్త పిటిషన్‌ దాఖలు చేయడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ వివాదానికి సంబంధించిన న్యాయపరమైన చరిత్రను ప్రస్తావిస్తూ, ఒడిశా 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. అనంతరం ప్రతికూల తీర్పు వెలువడిన నేపథ్యంలో 2006లో కోర్టు ధిక్కరణ, నివారణ పిటిషన్లు దాఖలయ్యాయని వివరించారు. కొఠియా విషయంలో గత బిజూ జనతా దళ్‌ (బీజేడీ) ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయపోరాటానికి అవసరమైన సన్నద్ధత చూపలేదని సురేష్‌ పూజారి విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఒడిశా ఉనికిని బలోపేతం చేయడానికి బదులుగా ఉత్తర ప్రత్యుత్తరాలకే పరిమితమైందని ఆరోపించారు.

అభివృద్ధితో ప్రజలకు చేరువ

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొఠియాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు మంత్రి తెలిపారు. స్థానిక ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు వివిధ శాఖల మంత్రులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు, కొఠియా ఒడిశాలో అంతర్భాగమని బీజేడీ స్పష్టం చేస్తోంది. తాజా పరిణామాలపై బీజేపీ ప్రభుత్వం తగిన రీతిలో స్పందించడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి లెనిన్‌ మహంతి విమర్శించారు. 2000 నుంచి 2024 వరకు తమ ప్రభుత్వం ఈ ప్రాంతంలో రహదారులు, విద్య, వైద్యం, తాగు నీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని వివరించారు. కొఠియాను కుందులి, డోలియాంబో–నారింగిపొదొరొ, దేవ్‌మాలి తదితర ప్రాంతాలతో అనుసంధానించే రహదారుల నిర్మాణంతో పాటు, ఒడిశా ఆదర్శ విద్యాలయం, గిరిజన బాలబాలికల వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పది పడకల ఆస్పత్రి, ఉన్నతీకరించిన ఆరోగ్య ఉపకేంద్రాలు, మొబైల్‌ వైద్య సేవల ద్వారా ఆరోగ్య సదుపాయాలను విస్తరించామని, పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు, విద్యుత్‌ సరఫరా, తాగునీరు, మొబైల్‌ కనెక్టివిటీ మెరుగుదలకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బిజూ పక్కా ఘొరొ యోజన కింద వందలాది కుటుంబాలకు ఇళ్లు అందించినట్లు వివరించారు.

రాజకీయ విమర్శల మధ్య

ప్రాదేశిక సమగ్రతపై చర్చ

కొఠియాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయం నేపథ్యంలో, ఒడిశా ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నవీన్‌ పట్నాయక్‌ సోమవారం ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీని కోరారు. కొఠియాపై ఒడిశా హక్కులను కాపాడటంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ఒడిశా – ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని కొరాపుట్‌ జిల్లాలో ఉన్న కొఠియా గ్రామ సముదాయం దశాబ్దాలుగా ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రంగా ఉంది. స్థానిక ప్రజలకు సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు అందించడం ఈ వివాదంలో కీలక అంశాలుగా మారాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కొఠియాలో పరిపాలనా పర్యవేక్షణను పటిష్ఠం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, న్యాయపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా తన వాదనను బలోపేతం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement