పర్లాకిమిడి: ఈ ఏడాది విజయదశమి తగులు, మిగులు పడడంతో మంగళవారంతో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినా అమ్మవారికి అనుపోత్సవం పర్లాకిమిడిలో జరుపలేకపోయారు. బుధవారం మధ్యాహ్నం వరకు దశమి తిథి కొనసాగడంతో అనుపోత్సవాలు చేయలేదు. గురువారం లక్ష్మీకి అత్యంత ప్రీతికరమైన వారం కావడంతో అమ్మవారికి ధూపదీపాలు అందించి పూజలు కొనసాగించారు. దీంతో పట్టణంలో ప్రజారోగ్యశాఖ, పెద్ద బ్రాహ్మణవీధి, ఎలక్ట్రికల్, గాంధీ జంక్షన్, కటిక వీధిల్లో వెలిసిన అమ్మవారి విగ్రహాలకు శుక్రవారం అనుపోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. దీంతో విజయ దశమి గడిచినా.. రెండురోజుల పాటు దుర్గామాత పూజా మందిరాల్లో పూజలను అందుకుంటోంది.
అరుదైన శస్త్ర చికిత్స
● యువతి కడుపులో 20 కిలోల కణితి తొలగింపు
మల్కన్‌గిరి: స్థానిక జిల్లా ఆస్పత్రిలో గురువారం అరుదైన శస్త్ర చికిత్సను వైద్యుడు సోపన్‌కుమార్ డిండా నిర్వహించారు. 17 ఏళ్ల యువతి కడుపులో ఉన్న దాదాపు 20 కిలోల కణితిని గుర్తించి ఆపరేషన్ చేసి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా బంగాడి గ్రామానికి చెందిన ఖాను సింగ్ కుమార్తె తులసి సింగ్ కొన్ని నెలలుగా కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. దీంతో స్థానికంగా వైద్యులు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం సిఫార్సు చేశారు. దీంతో స్థానిక ఆస్పత్రికి తీసుకొని రాగా వైద్యుడు సోపన్ కుమార్ డిండా ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది తక్కువ ఖర్చుతో రెండు గంటలు పాటు శ్రమించి విజయవంతంగా యువతి కడుపులో కణితిను తొలగించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యంగా ఉంది.
వేరే ‘దారి’ లేక..
రాయగడ : గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఎంత అసంపూర్తిగా ఉందో జిల్లాలో మరో ఘటన స్పష్టం చేసింది. గ్రామానికి సరైన రహదారి లేకపొవడంతో 108 అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలింతను అంబులెన్స్ సిబ్బంది సుమారు కిలోమీటరు దూరం స్ట్రెచర్‌పై మోసుకువెళ్లి ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని కాసీపూర్ సమితి సుంగేరు పంచాయతీ పరిధిలోని సరంబాయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు తక్షణ వైద్య చికిత్స అవసరం కావడంతో సమాచారం అందుకున్న కాసీపూర్ 108 అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. అయితే సరైన రహదారి లేకపోవడంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ పరిఖిత్ నాయక్ , సహయకుడు అభిరామ్ నాయక్, ఫార్మసిస్ట్ బిందు సాగర్ బాగ్ కలసి బాలింతను స్ట్రెచర్‌పై సమారు కిలోమీటరు దూరం మోసుకువెళ్లి సరంబాయి పాఠశాల సమీపంలో ఆగి ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఆమెను కాసీపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్సను అందించిన వైద్యులు ప్రస్తుతం తల్లీ,బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది.


