భువనేశ్వర్: అక్టోబర్ 8న ఒడిశా బంద్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నివాసం సమీపంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఫార్వర్డ్ బ్లాక్, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళన ప్రాంగణం నిరసనకారుల నినాదాలతో మారుమోగింది. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి ఆందోళనకారులు దూకుడు ప్రదర్శించడంతో పోలీసులతో ఘర్షణ వేడెక్కింది. పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర శాసన సభలో వర్షాకాల సమావేశాలు ముందస్తుగా నిరవధిక వాయిదా పడటంతో నిరసనకారులు రాష్ట్ర శాసన సభ ముట్టడి ప్రణాళికను మార్చుకుని ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ప్రదర్శన చేశారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఒడిశా ప్రజలకు ద్రోహం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఒడిశా బంద్‌ను ప్రకటించారు. ఇండియా బ్లాక్ తరపున ఈ బంద్‌కు తమ మద్దతును అందించాలని సీపీఐ, సీపీఐ(ఎం), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మరియు ఇతర పార్టీలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో పాల్గొనాలని సభా ముఖంగా ప్రజలకు కోరారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఎంఎండీఆర్ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఒడిశావ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారని భక్త చరణ్ దాస్ తెలిపారు.


