● వర్షాలకు దారుణంగా తయారైన రహదారులు
● కనీసం అంబులెన్స్‌లు వెళ్లక నరకయాతన
మెళియాపుట్టి: కొండ దారులకు వాన దేవుడు శాపం పెట్టినట్టు ఉన్నాడు. ఇటీవల కురిసిన వానలకు మెళియాపుట్టి మండలంలోని గిరిజన గ్రామాల రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఆంపురం నుంచి ఎగువరింపి గ్రామం వరకు 2 కిలోమీటర్ల రహదారి రూ.1.72 కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్ బోర వెంకట ప్రసాద్ మట్టి తవ్వి మెటల్ వేసి విడిచిపెట్టారు. వర్షాలు పడిన ప్రతి సారి జేసీబీతో చదును చేసి విడిచి పెట్టేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రహదారి బురద, గుంతలతో రాకపోకలకు వీలుకాకుండా తయారైంది.
● చింతల పోలూరు నుంచి అచ్చనాపురం వెళ్లే రహదారికి (5 బిట్లు) రూ.సుమారు 5కోట్లతో పనులు మంజూరయ్యాయి. మెటల్ వేసి విడిచి పెట్టారు. ప్రస్తుతం రహదారి కాలువను తలపిస్తోంది.
● చప్టా కొట్టుకుపోవడంతో డేగల పోలూరు గ్రామానికి రాకపోకలకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం రాత్రి అస్వస్థకు గురైంది. 108 కు ఫోన్ చేశామని వాహనం గ్రామానికి రాలేకపోవడంతో మోసుకుంటూ ఆస్పత్రికి తరలించామని గ్రామస్తులు చెబుతున్నారు. ఆదివారం స్థానికులు మెటల్ వేసి కాలినడకకు ఉపయోగించే విధంగా రహదారికి మరమ్మతులు చేశారు.


