రాయగడ: వర్షాలతో కొరాపుట్–రాయగడ, కొరాపుట్–జయపురం రైల్వే సెక్షన్లలో కొండ చరియలు విరిగిపడడం, మట్టి కొట్టుకురావడం, నీరు నిలిచిపోవడంతో దెబ్బతిన్న రైల్వే మార్గాల పునరుద్ధరణ పనులను ఈస్ట్‌కోస్టు రైల్వే యుద్ధ ప్రాదిపదికన చేపట్టింది. ముఖ్యంగా మలిగుడ రైల్వే యార్డులో భారీగా మట్టి పేరుకుపొవడంతో పునరుద్ధరణ పనులు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్ మలిగుడకు చేరుకుని అక్కడ కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. దెబ్బతిన్న రైల్వే మార్గంలోని పలు ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. మలిగుడలో పనరుద్ధరణ పనుల కోసం అధికారులు, సిబ్బందితో పాటు 600 మంది పైగా కార్మికులను రంగంలోకి దించారు. భారీ యంత్రాలు, ఇతర ఆధునిక పరికరాలతో నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి.
నరసన్నపేట: స్థానిక పచూరి కాలనీలో నివాసముంటున్న గరికి అనిల్‌కుమార్ (34) అనుమానాస్పదంగా మంగళవారం వేకువజామున మృతి చెందాడు. ఇళ్లరికం వచ్చిన అనిల్‌కుమార్ భార్య పార్వతితో కలిసి పచూరికాలనీలో నివాసముంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన అనిల్ రాత్రి వరకూ లేవకపోవడంతో భార్య గమనించి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారాన్ని శ్రీకాకుళం రెడ్డికివీధిలో ఉంటున్న తల్లి గరికి లక్ష్మికి తెలియజేయగా ఆమె వచ్చి కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా తల్లి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న కుమారుడు ఒక్కసారిగా చనిపోవడం ఏంటని ఆందోళన చెందారు. కోరుకున్న అమ్మాయితో వివాహం చేశానని, పెళ్లయిన ఏడాది వరకూ అందరం కలిసే ఉన్నామని, తరువాత భార్య ఇంటికి వచ్చేశాడని తెలిపింది. నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని, ఇంతలో అనిల్ చనిపోవడం దారుణమని వాపోయింది.
పోస్టుమార్టం చేసేందుకు అవస్థలు..
అనిల్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక షెడ్ వద్దకు తీసుకురాగా పీఎం చేసే సిబ్బంది, బంధువులు అవస్థలు పడ్డారు. రోడ్డంతా బురదమయంగా మారడంతో దూరంలోనే అంబులెన్స్ నిలిపి షెడ్ వరకూ మృతదేహాన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.


