కొరాపుట్: సాధారణంగా వైద్యుల చేతిరాతను అర్థం చేసుకోవడం రోగులకే కాదు.. చాలా మందికి పెద్ద సవాలే. దశాబ్దాలుగా ఇది కొనసాగుతున్న విషయ మే. అయితే ఒడిశాలోని కొరాపుట్‌కు చెందిన ఒక ప్రభుత్వ వైద్యుడు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలలో సర్జన్‌గా సేవలందిస్తున్న డాక్టర్ శివ ప్రసాద్ సేనాపతి రాస్తున్న ప్రిస్క్రిప్షిన్లు ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి. రోగులకు సులభంగా అర్థమయ్యేలా ఆయన మాతృభాషలోనే మందుల పేర్లను సూచిస్తున్నారు. అంతేకాకుండా ము త్యాల్లాంటి అందమైన అక్షరాలతో రాయడం విశేషం. దీంతో తాము ఏ మందులు ఎందుకు వాడుతున్నామో స్పష్టంగా తెలుసుకునే వెసులుబాటు కలగడంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉన్న ఆయన ప్రిస్క్రిప్షిన్ పత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రోగులపై ఆయన చూపిస్తున్న శ్రద్ధను నెటిజన్లు విశేషంగా కొనియాడుతున్నారు.


