శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో తమ్మినేని చల్లన్న అనే రైతుకు చెందిన 75 సెంట్ల భూమిపై బీజేపీ నేత కన్ను పడిందని మాజీ డీజీపీ, సీఎఫ్‌ఎల్(సెంటర్ ఫర్ లిబర్టీ) చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎప్పుడో 45 ఏళ్ల కిందట తమ్మినేని చల్లన్న అనే వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చిన డీపట్టా భూమిలో రాత్రికి రాత్రి గ్రావెల్ వేశారని ఆయన మనవడు తమ్మినేని అజయ్, మిగతా కుటుంబ వారసులు జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తే.. విచారణకు వచ్చిన ఎచ్చెర్ల తహసీల్దారు ‘భూమి ఎవరికో మీరు అమ్మేశారు.. ప్రభుత్వం అందుచేత తిరిగి తీసుకుంటుంది’ అని చెప్పి తప్పుడు నోటీసులు పంపడం దారుణమన్నారు. ఎచ్చెర్ల మండలం కింతలిమిల్లు జంక్షన్ సమీప ఎన్‌హెచ్–16 సర్వీసు రోడ్డును ఆనుకుని ఉన్న 75 సెంట్ల డీపట్టా స్థలం వద్ద రైతు తమ్మినేని చల్లన్న తరఫున మాజీ డీజీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మంగళవారం సాయంత్రం మాట్లాడారు. హైవేను ఆనుకుని ఉన్న స్థలం కావడంతో బీజేపీ నేత కన్ను పడిందని, స్థానిక ఎమ్మెల్యే అండదండలతో రెవెన్యూ, పోలీస్ విభాగాలను అడ్డం పెట్టుకుని ఏకంగా చంపేస్తామని రైతు కుటుంబ సభ్యులను బెదిరించే స్థితికి వచ్చారంటే కూటమి ప్రభుత్వం, స్థానిక బీజేపీ నేతలు, ఎమ్మెల్యే ఎంతకు తెగించారో స్పష్టమవుతుందని ఆయన అన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ భూమిలో గ్రావెల్ వేశారని రైతు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే.. తిరిగి ఎమ్మార్వో వారికి నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులో అన్నీ తప్పులే ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రైతు కుటుంబీకులకు ప్రాణహాని నేపథ్యంలో రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు సీఎఫ్‌ఐ ప్రెసిడెంట్ నల్లమోటు చక్రవర్తి, డైరెక్టర్ అజయ్ మల్లారెడ్డి, డైరెక్టర్ ఎం.జితేంద్ర, ఎద్దుల పుల్లయ్య, సురేష్ ఉన్నారు.


