పర్లాకిమిడి: భారతరత్న, భారత హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాథన్ మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని పర్లాకిమిడి సెంచూరియన్ వర్సిటీ కొత్త ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. డీన్, అగ్రకల్చర్ ప్రొఫెసర్ సాగర్ మైత్రా తదితరులు స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పి్‌ంచారు. డైరక్టర్ దేవేందర్‌రెడ్డి, విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, ఏరియా ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ పరిడా తదితరులు ప్రసంగించారు. సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్ధ్యం, వ్యవసాయ పరిశోధనలకు, రైతాంగానికి మధ్య సంబంధం బలోపేతం చేయడంలో స్వామినాథన్ కృషి అభినందనీయమని ప్రసన్న కుమార్ పరిడా అన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ వ్యవసాయ విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను సాగర్ మైత్రా చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎస్.పి.నందా (డీన్), అసోసియేట్ డీన్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
భారీ వానలకు కూలిన 206 ఇళ్లు
జయపురం: జయపురం తహసీల్ పరిధిలో ఇటీవల పడిన ఎడతెరిపి లేని కుండపోత వర్షాలు కారణంగా 206 పూర్తిగా పాక్షికంగా కూలినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జయపురం తాలూకాలో కుములిపుట్, బొడొజివుణి, చారగాం, సిందిగాం, హరడాపుట్, హడియ, బాజీగుడ, దండసేనగుడ, ఖుడిపి, పూజారిగుడ, భీమగుడ, సానముఖిగుడ, బిశాయిపుట్, కెరాపుట్, పుట్ర, జాముండ, హటకొంగ, హడప, కుంతరకాల్, జబాకనాడి. పండురగుడ, మాలిడొంబుగుడ, భత్రీ, నువాగుడ, ఘాటభగ్ర గ్రామాల్లో ఇల్లు కూలాయని తెలిపారు. వీరికి పాలిథీన్ టార్పాలిన్లు అందజేశారు.
ఖోయిర్‌పూట్ సమితిలో
కేజీబీవీ హాస్టల్ ప్రారంభం
మల్కన్‌గిరి: ఖోయిర్‌పూట్ సమితి పోడాఘాట్ గ్రామంలో ఉన్న ఒడిశా ఆదర్శ పాఠశాలాలో సోమవారం కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని అధికారికంగా ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వసతి గృహం అందుబాటులోకి రావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే బాలికలు ఇక పై ఈ వసతి గృహంలో ఉండి చదువుకోవచ్చు. అలాగే విద్యార్థుల కోసం వసతి గృహంలో అని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మల్కన్‌గిరి కలెక్టర్ ప్రధమేశ్ అరవింద్ కృషితో ఈ హాస్టల్ వచ్చింది.
వర్షా కాలం సమావేశాలు..నిరవధికంగా వాయిదా
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలను సోమవారం నిరవధికంగా వాయి దా వేశారు. సమావేశాన్ని ముగించాలని కోరుతూ చీఫ్ విప్ సరోజ్ కుమార్ ప్రధాన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో, స్పీకర్ సురమా పాఢి సభను నిరవధికంగా వాయిదా వేశారు. 17వ ఒడిశా శాసన సభ ఏడో విడత సమావేశాలు ఈ నెల 22న ప్రారంభమయ్యాయి. ఇటీవల జారీ చేసిన కార్యక్రమం ప్రకారం అక్టోబర్ 3 వరకు కొనసాగాల్సి ఉంది. వాస్తవానికి ఈ సమావేశాలు 9 పని రోజులు జరగాల్సి ఉండగా.. 5 రోజుల తర్వాత ముగిశాయి. ఈ వ్యవధిలో శాసన సభలో 4 బిల్లులను ఆమోదించారు. ఎంఎండీఆర్ బిల్లుపై ప్రతిపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడంతో పాటు పాఠశాల పాఠ్య పుస్తకాల్లో తప్పులు ఉన్నాయని ఆరోపించడంతో సభా కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. సభ నిరవధికంగా వాయిదా పడటంతో, వర్షాకాల సమావేశాలు నిర్ణీత గడువు కంటే ముందే లాంఛనంగా ముగిశాయి.


