రైలు మార్గాల్లో పునరుద్ధరణ పనులు | - | Sakshi
Sakshi News home page

రైలు మార్గాల్లో పునరుద్ధరణ పనులు

Sep 26 2026 1:32 AM | Updated on Sep 26 2026 1:32 AM

రాయగడ: రాయగడ రైల్వే డివిజన్‌ పరిధిలోని కొరాపుట్‌–రాయగడ, కొరాపుట్‌–జయపురం రైల్వే సెక్షన్‌లలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, మట్టి కొట్టుకురావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు తూర్పుతీర రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అదే సమయంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు రవాణా, ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలను రైల్వే శాఖ కల్పించింది.

300 మంది సిబ్బందితో పునరుద్ధరణ

ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్‌ పునరుద్ధరణ భద్రతా చర్యలు కోసం సుమారు 300 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. ఛతడిపుట్‌లో 60 మంది, మలిగుడలో 150 మంది, కేవుటి గుడ–రౌలి లో 75 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఆహార ఏర్పాట్లు కూడా చేశారు. సీనియర్‌ రైల్వే అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు.

ప్రత్యేక బస్సులు

రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కొరాపుట్‌ నుంచి జగదల్‌పూర్‌, జయపురం వైపు వెళ్లాల్సిన ప్రయాణికుల కొసం రాయగడ డివిజన్‌ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కొరాపుట్‌లో ఫార్ట్‌ టెర్మినేట్‌ (పాక్షిక రద్దు) చేసిన రైలు నంబరు 18005 లోని సుమారు 110 మంది ప్రయాణికులకు రాత్రివేళ జగదల్‌పూర్‌ కు తరలించేందుకు బస్సు ఏర్పాటు చేశారు. అలాగే రైలు నంబర్లు 18107, 18447 ప్రయాణికుల కోసం కూడా కొరాపుట్‌ నుంచి జయపురం, జగదల్‌పూర్‌కు బస్సులు నడిపించారు. కొరాపుట్‌లో 58 సీట్ల సామర్థ్యం గల ఐదు బస్సులను సిద్ధంగా ఉంచడంతో పాటు అత్యవసర అవసరాల కోసం మరొ బస్సును స్టాండ్‌బైలో ఉంచారు. అనంతరం ప్రయాణికుల అవసరాన్ని బట్టి జగదల్‌పూర్‌ కు రెండు, జయపురానికి ఒక బస్సును ఏర్పాటు చేశారు.

భద్రతకు అత్యధిక ప్రాధాన్యం

ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే అధికారులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేస్తూ పునరుద్ధరణ పనులు, ప్రయాణికుల సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. భద్రతా పరిస్థితులను బట్టి రైళ్ల రాకపోకలను నియంత్రించడంతో పాటు అవసరమైన చొట వేగ పరిమితులు విధిస్తున్నారు.

ప్రయాణికులకు సూచన

భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైళ్ల రాకపోకలకు సంబంధిత తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఈ మేరకు హెల్ప్‌ లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్‌ నంబరు ..9237609635, కమర్షియల్‌ కంట్రోల్‌ నంబరు 9237609505, రాయగడ డివిజన్‌ వార్‌ రూం నంబరు 9237609510 ను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement