భువనేశ్వర్: తలసీమియాపై అవగాహన కల్పించి గుర్తించని కేసులను వెలుగులోకి తేవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి శుక్రవారం పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒడిశా రాష్ట్ర శాఖ నిరంతర అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. స్థానిక లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్‌లోని కాన్ఫరెన్స్ రూమ్‌లో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒడిశా రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ, పెరుగుతున్న తలసీమియా రోగుల సంఖ్య, గుర్తించని కేసులు ఉండే అవకాశం ఉన్నందున నిరంతర అవగాహన ప్రచారాల ఆవశ్యకత నెలకొందన్నారు. కార్యనిర్వాహక మండలి తమ కార్యకలాపాలను క్రమం తప్పకుండా సమీక్షించి పర్యవేక్షించేందుకు ఏడాదికి కనీసం 3 సార్లు సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు. భారత రెడ్ క్రాస్ సొసైటీ మానవాళికి నిస్వార్థ సేవ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచి ప్రాణాలను రక్షించడంలో సకాలంలో ప్రజలకు అండగా నిలవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ అభినందించారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఐఆర్‌సిఎస్–ఓఎస్‌బి కార్యదర్శి గణేష్ చంద్ర పాత్రో, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, పంచాయతీ రాజ్, తాగు నీటి శాఖల సీనియర్ అధికారులు, ఐఆర్‌సిఎస్–ఓఎస్‌బి కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, ఇతర సంబంధిత శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


