జయపురం: జయపురం పంచాయతీ సమితిలో వార్షిక అభివృద్ధి పనులను కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ గురువారం సమీక్షించారు. జయపురంలో గల పంచాయతీ కార్యాలయం సందర్శించి సమితి చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల నిర్వహణ తీరు, వాటి అభివృద్ధిపై సమీక్షించారు. పంచాయతీ సమితి కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమితిలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. అనంతరం ఆయన పంచాయతీ సమితి కార్యాలయంలో వివిధ విభాగాల బ్లాక్‌లను సందర్శించి ముఖ్యమైన ప్రభుత్వ రికార్డులను పరిశీలించారు. పెండింగ్ పనులపై ఆయన సిబ్బందితో చర్చించారు. ప్రజా సంక్షేమ పనుల నిర్వహణ తీరుపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజాసంక్షేమ, సహాయ పథకాలు ప్రజల వద్దకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సమితి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిష్టతో అమలు చేయాలని సమితి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశంలో సమితి బీడీఓ శక్త మహాపాత్ర, సమితి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


