భువనేశ్వర్: శిశువుల్లో గ్రహణం మొర్రి తొలగింపు కోసం స్థానిక హై టెక్ వైద్య బోధన ఆస్పత్రిలో ఉచిత శస్త్ర చికిత్స శిబిరం నిర్వహిస్తుంది. ఈ శిబిరంలో 50 మంది శిశువులకు ఈ సమస్య తొలగించి ముఖంపై చిరు నవ్వు చిందింపజేయడం లక్ష్యంగా హైట టెక్ దంత వైద్య ఆస్పత్రి చైర్మన్, శస్త్ర చికిత్స నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ సంజయ పాత్రో తెలిపారు. ఈ విడతలో 6 నెలల నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య పీడితులకు గ్రహణం మొర్రి నుంచి విముక్తి కలిగించేందుకు కార్యక్రమం ఖరారు చేసినట్లు తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం నిర్ణీత కాలంలో ప్రతి బిడ్డకు ఉచిత శస్త్ర చికిత్సతో అనుబంధ మందులు, తదనంతర సంరక్షణ అందించబడతాయన్నారు.
భాగస్వామ్యంతో...
క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్, ‘మిషన్ స్మైల్’ సంస్థలు స్థానిక హై టెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో గ్రామీణ్ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచితంగా, సురక్షితంగా, పూర్తి స్థాయిలో పెదవి, అంగిలి చీలిక చికిత్సను అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ భాగస్వామ్యం కింద హై టెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ శస్త్ర చికిత్సకు అవసరమైన వైద్య సౌకర్యాలను అందిస్తుంది. మిషన్ స్మైల్ సంస్థ రోగుల గుర్తింపు, స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్, శస్త్రచికిత్స సౌకర్యాలు, తదనంతర సంరక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 53,000 మందికి పైగా పిల్లలు ఈ శస్త్ర చికిత్స సౌలభ్యంతో చిరు నవ్వులు చిందిస్తున్నారని భాగస్వామ్య వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. వీరిలో ఒడిశాలోనే 3,000 మందికి ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. వారిలో అత్యధికలు హై టెక్ డెంటల్ హాస్పిటల్‌లో 2,000 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు జరిగాయని పేర్కొన్నారు. మిషన్ స్మైల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కాన్రాడ్ జి.డెన్నిస్ మాట్లాడుతూ ప్రతి విజయవంతమైన శస్త్ర చికిత్స ఒక బిడ్డకు తినడానికి, మాట్లాడటానికి, నవ్వడానికి, ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి అవకాశాన్ని ఇస్తుందన్నారు. ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ విజయ్ కుమార్ ధల్ ముఖ్య అతిథిగా హాజరు కాగా హైటెక్ డెంటల్ కాలేజ్ తాత్కాలిక ఛైర్‌పర్సన్ మధుస్మిత త్రిపాఠి గౌరవ అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి హై టెక్ డెంటల్ కాలేజ్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ పాత్రో, ప్రొఫెసర్ డాక్టర్ అబితోష్ దేవ్, మిషన్ స్మైల్ సీఈఓ కర్నాడ్ డెన్నిస్, డాక్టర్ సిద్ధార్థ నాయక్, డాక్టర్ నారాయణ్ ఆచార్య, జితేంద్ర పాణిగ్రాహి తదితరులు హాజరయ్యారు.


