బాలాసోర్‌ అడవుల్లో ఒరంగుటాన్‌లు..! | - | Sakshi
Sakshi News home page

బాలాసోర్‌ అడవుల్లో ఒరంగుటాన్‌లు..!

Sep 9 2026 12:47 AM | Updated on Sep 9 2026 12:47 AM

బాలాసోర్‌ అడవుల్లో ఒరంగుటాన్‌లు..!

5 జంతువులను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు

ఎలా వచ్చాయని దర్యాప్తు

అక్రమ రవాణాపై అనుమానాలు

భువనేశ్వర్‌: ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా అడవిలో మంగళవారం 5 వానర జాతి జీవులు ఒరంగుటాన్‌లు కనిపించడం కలకలం రేపింది. కేవలం ఇండోనేషియా, మలేషియాలో మాత్రమే కనిపించే ఈ జాతి జీవులు భారతీయ అడవులకు స్థానికం కాని అడవిలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వార్త వ్యాపించడంతో బిచిత్రాపూర్‌ అటవీ ప్రాంతం సమీపంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకుని 5 ఒరాంగుటాన్‌లను సంరక్షించారు. ఆరోగ్య పరీక్షల కోసం వాటిని జంతు వైద్య ఆస్పత్రికి తరలించారు. ఈ జంతువులు అడవి మనుషులను పోలి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే బాలాసోర్‌లోని ఉదయ్‌పూర్‌, బిచిత్రాపూర్‌ అడవికి ఈ అరుదైన జంతువులు ఎలా చేరుకున్నాయనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని ఎవరైనా పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారా..? లేక అక్రమంగా రవాణా చేసి ఇక్కడికి తీసుకువచ్చారా అనే విషయంపై అటవీ శాఖ దర్యాప్తు చేస్తోంది. వన్య ప్రాణుల పీసీసీఎఫ్‌ ప్రేమ్‌ ఝా సమాచారం ప్రకారం ఈ ఘటన వెనుక అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అటవీ శాఖ వన్యప్రాణి విభాగం ఈ విషయంపై దర్యాప్తు చేపడుతోంది. సమాంతర విచారణ జరిపేందుకు స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. వైల్డ్‌లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) కూడా ఈ ఘటనపై విచారణ జరపనుంది.

ఒడిశాలో కనిపించిన దాఖలాలు శూన్యం

భారతదేశంలో కేవలం రెండు లేదా మూడు ప్రదేశాల్లో మాత్రమే ఒరంగుటాన్‌లు అరుదుగా కనిపిస్తాయి. ఒడిశాలో అవి కనిపించిన దాఖలాలు లేవని పీసీసీఎఫ్‌ ప్రేమ్‌ ఝా అన్నారు. బారంగ్‌ నందన్‌కానన్‌ జంతు ప్రదర్శన శాల వన్య ప్రాణుల వైద్యులతో కూడిన బృందం రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ఈ బృందం భొగరాయ్‌కు బయల్దేరింది. నందన్‌కానన్‌ జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చిన తర్వాత ఒరంగుటాన్‌లను క్వారంటైన్‌లో ఉంచుతారు. వాటి ఆరోగ్య పరిస్థితి, జాతి, సంభావ్య ఆవిర్భావం నిర్ధారణ అనుబంధ పరిశీలన చేపట్టడం జరుగుతుందని ఈ బృందం వివరించింది. వాటి శారీరక పరిస్థితి, శాసీ్త్రయ పరీక్షలు కీలకమైన ఆధారాలను వెలుగులోకి తెస్తాయని భావిస్తున్నారు. వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే ఉష్ణ మండల వర్షారణ్యం ఈ జీవుల సహజ ఆవాసం. స్థానిక వాతావరణం కూడా పెద్దగా భిన్నంగా లేదు. కాబట్టి ఒరాంగుటాన్‌లు స్వల్ప నిడివిలో అలవాటుపడగలవు. అయితే వాటిని ఇక్కడ ఉంచడానికి తగినన్ని సౌకర్యాలు లేనందున వాటిని నందన్‌ కానన్‌కు తరలించాలని నిర్ణయించారు. గతంలో నందన్‌కానన్‌లో ఒక ఒరాంగుటాన్‌ ఉండేది. అది చనిపోవడంతో సందర్శకులకు ఈ జాతి కనుమరుగై పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement