మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజేశిర్కేకు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు వరించింది. పరిపాలన సామర్థ్యం, ప్రజా సంక్షేమం, వినూత్న కార్యక్రమాల అమలులో మల్కన్‌గిరి జిల్లా కీలక విజయాన్ని సాధించింది. జిల్లాలో యువత సాధికారత కోసం చేపట్టిన ప్రధాన కార్యక్రమం ప్రగతి పధే యువ మల్కన్‌గిరికి ప్రతిష్టాత్మక జాతీయ స్కాచ్ అవార్డు ప్రధానం చేయనున్నారు. దీంతో ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
చట్టాలపై అవగాహన అవసరం
మల్కన్‌గిరి: చట్టాలపై మహిళలకు అవగాహన అవసరమని వక్తలు పేర్కొన్నారు. మల్కన్‌గిరి జిల్లా సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మల్కన్‌గిరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ముఖ్యంగా గృహహింస చట్టం, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా ప్రజారోగ్య అధికారి డా.మినతీ మహంతి, అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ మహాపాత్రో, రక్షణ అధికారి టి.జయలక్ష్మి, మహిళ సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త మణిమోహన్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిశీలన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఓటర్ల జాబితా పరిశీలకుడు మహ్మద్ సాధిక్ అలం మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ సమయంలో వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి పురోగతిని, సంబంధిత కేసు రికార్డులను ఆయన స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజేశిర్కే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బార్ ప్రధాన్, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి తదితరులు పాల్గొన్నారు.
నదిలో మృతదేహం లభ్యం
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పట్టణంలో 7వ వార్డు పరిధి పోస్టాఫీస్ లైన్ సమీపంలోని నదిలో మునిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బలిమెలకు చెందిన గుప్తేశ్వర్ మహంతి అనే వ్యక్తి ఆదివారం ఉదయం నుంచి ఇంటి వద్ద కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామమంతా వెదికారు. అయితే మంగళవారం ఉదయం కొంతమంది స్థానికులు నది వద్దకు కాలకృత్యాలు కోసం వెళ్లగా నదిలో మృతదేహం తేలుతూ కనిపించడంతో వెంటనే బలిమెల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక అధికారి మంగుళ కిసాన్ నేతృత్వంలో ఒక బృందం నదిలో దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం బలిమెల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఐఐసీ రీగాన్‌కీండో కేసు నమోద్ చేసి మృతదేహన్ని మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికు తరలించారు. కాగా గుప్తేశ్వర్ కాలుజారి నదిలో పడిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.


