రాయచోటి: జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి విక్రయాలపై చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా తీసుకువచ్చి రాయచోటిలో విక్రయిస్తున్న 1.5 కిలోల గంజాయిని, ముగ్గురు విక్రేతలను స్థానిక పోలీసులు పట్టుకున్నారన్నారు. సయ్యద్ హుజైఫా, కత్తి వినయ్ కుమార్, సయ్యద్ మహమ్మద్ రఫీలు గంజాయి విక్రయిస్తున్న వారిలో ఉన్నారన్నారు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మత్తు పదార్థాల విక్రయాల ద్వారా అందుతున్న ఆదాయాలతో కూడబెడుతున్న ఆస్తులపై కూడా దాడులు చేస్తామన్నారు. ఇలాంటి అవినీతి అక్రమాల కారణంగా సంపాదించిన ఆస్తులపై కూడా చట్టపరంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే క్రమంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా సిబ్బందిని ఏర్పాటు చేసి, నివారణ చర్యలు చేపట్టామన్నారు. గంజాయి విక్రయాలపై తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని అధికారులు, ప్రజలను ఎస్పీ కోరారు. సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్, సీఐ బి.వి.చలపతి, ఎస్‌ఐ యస్.అబ్దుల్ జహీర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ముగ్గురు విక్రేతల అరెస్ట్


