పర్లాకిమిడి: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, సమాజంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా సెంచూరియన్ వర్సిటీ పర్లాకిమిడి క్యాంపస్ గుసాని సమితి కోర్సండ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కోర్సండ గ్రామంలో ప్రభుత్వ రాజీవ్ మెమోరియల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఉదయం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎఫ్‌వో కె.నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాకుండా.. వాటి సంరక్షణకు సైతం బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ కళాశాల డీన్ ప్రొఫెసర్ సాగర్ మైత్రా, డా.రితీష్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డా.బిష్ణుప్రసాద్ దాస్, రాజీవ్ మెమోరియల్ పాఠశాల హెచ్‌ఎం బి.రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ
అక్షరాస్యతా దినోత్సవం
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల, మల్కన్‌గిరి, చిత్రకొండ, మత్తిలి, కోరుకొండ, పోడియా ఖోయిర్‌పూట్ సమితుల్లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పాఠశాల స్థాయిలో స్లోగన్స్ రైటింగ్ పోటీలు, అక్షరాస్యతపై అవగహన కల్పించే పోస్టర్ తయారీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే అన్ని సమితుల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
మృతురాలు ఒడిశా వాసి
సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని కాట్రగడ్డ గ్రామ సమీపాన సీలేరు నది ఒడ్డున మూడు రోజుల క్రితం లభ్యమైన గుర్తు తెలియని గిరిజన మహిళ మృతదేహం వివరాలు ఎట్టకేలకు లభ్యమయ్యాయి. ఎస్‌ఐ యాసిన్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు ఒడిశా రాష్ట్రం చిత్రకొండ పంచాయతీ పరిధిలోని పూజారిగూడ గ్రామానికి చెందిన సైత పాంగి (52)గా గుర్తించారు. ఆమె తన ఇంటి వెనుక భాగంలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మహిళ మృతదేహం సీలేరు నదిలో కొట్టుకొచ్చి కాట్రగడ్డ సమీపాన ఒడ్డుకు చేరింది. రెండు రోజుల పాటు సమీప గ్రామాల ప్రజలకు సమాచారం అందించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అధికారులు మృతదేహాన్ని చింతపల్లి ఏరియా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. పత్రికా ప్రకటనతో పాటు ఒడిశా పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఒడిశా పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మృతురాలి వివరాలను ధ్రువీకరించుకుని, సంబంధిత బంధువులను సీలేరు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం బంధువులకు అప్పగించి అంత్యక్రియలు నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మహిళ మృతిపై బంధువులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని ఆయన పేర్కొన్నారు.


