ఖరగ్‌పూర్‌–అమరావతి హైస్పీడ్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం | - | Sakshi
Sakshi News home page

ఖరగ్‌పూర్‌–అమరావతి హైస్పీడ్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

రాయగడ: తూర్పు భారత దేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతితో అనుసంధానించే ప్రతిష్టాత్మక ఖరగ్‌పూర్‌–అమరావతి హై స్పీడ్‌ రోడ్‌ కారిడార్‌ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా సుమారు 1,107 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని 457 కిలొమీటర్ల అలైన్‌మెంటుకు కేంద్రం ఆమోదం లభించినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టు పనుల పురొగతిపై చర్చ ఊపందుకుంది. ఒడిశా పరిధిలో సుమారు 522 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారు. ఇది రాష్ట్రంలొని మయూర్‌భంజ్‌ (86 కిమీ) , కేంఝర్‌ (86), ఢెంకానాల్‌ (88), గంజాం (97), కటక్‌ (21), నయాఘడ్‌ (53), కొరాపుట్‌ (17)జిల్లాల మీదుగా వెళ్లేలా ప్రతిపాదించారు.

గుణుపూర్‌–రామనగుడకు ప్రత్యేక ప్రాధాన్యం

ఈ హైస్పీడ్‌ కారిడార్‌ రాయగడ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రతిపాదిత మార్గం గుణుపూర్‌, రామనగుడ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని కురుపాం ప్రాంతంతో అనుసంధానం కానున్నట్లు సమాచారం. దీంతో రాయగడ జిల్లాలోని సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కారిడార్‌ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో రాయగడ జిల్లాకు రాకపోకలు, వాణిజ్య సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుణుపూర్‌, రామనగుడ వంటి గిరిజన ప్రాంతాల్లొ వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్‌ కనెక్టివిటీ సులభతరం కావడంతో పాటు రవాణా సమయం ఖర్చు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రూ.75,629 కోట్ల అంచనా వ్యయం

నాలుగు లేన్లుగా నిర్మించనున్న ఈ హైస్పీడ్‌ కారిడార్‌లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా డిజైన్‌ చేయనున్నారు. నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.75,629 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. కారిడార్‌ పూర్తయితే పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రయాణికులు, సరకు రవాణా మరింత వేగవంతం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement