కొరాపుట్: రైలు ఢీకొన్న ఘటనలో ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. కొరాపుట్ జిల్లా కేంద్రానికి చెందిన పృద్వికుమార్ స్వయ్ (45) లమ్తాపుట్ సమితిలో రిజర్వాయర్ సమీపంలోని కటాఫ్ ప్రాంతం కుమార్ గంధన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. విధి నిర్వాహణ అనంతరం తన బైక్‌పై సుక్కు వంతెన దాటుతుండగా రైలు కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పృద్వికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం కొరాపుట్ తరలించారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొరాపుట్: కేరళలోని శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నసంతర్పణ కోసం కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల అయ్యప్ప భక్తులు ముందుకు వచ్చారు. విశాఖపట్నానికి చెందిన గురుస్వామి డాక్టర్ పైలా ఆదిమోహన్ రెడ్డి నేతృత్వంలో అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ గత ఏడాది శబరిమల సమీపంలో పంపావ్యాలీ గ్రామం వద్ద భక్తులకు ఉచిత అన్న ప్రసాద సేవనం ఏర్పాటు చేసింది. గత ఏడాది అయ్యప్ప స్వాముల సీజన్‌లో రెండు నెలల పాటు వేలాది మంది భక్తులకు తెలుగు సంప్రదాయ భోజనాలు, అల్పాహరం ఉచితంగా అందజేసింది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడంతో ప్రతి నెల శబరిమల తేరిచే రోజులలో ఈ అన్నసంతర్పణ కొనసాగుతుంది. ఆగస్టు నెలలో కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి జోలాపుట్‌కి చెందిన 40 మంది భక్తులు సేవకు వెళ్లడానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 16 తేదీ నుంచి 12 రోజులు అక్కడ వీరు వంటలు చేయడం, భక్తులకు వడ్డించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం చేస్తారు. ట్రస్ట్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న పొడుగు గుప్తేశ్వరరావు వీరందరికీ స్వంత ఖర్చులతో సేవకు తీసుకొని వెళ్తున్నారు. మరో వైపు ట్రస్ట్ నబరంగ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు ఎన్.జనార్దన్‌రావు నేతృత్వంలో కందిపప్పు, పెసర పప్పు, చింతపండు, జిలకర్ర తదితర నిత్యావసర వస్తువులు గుప్తేశ్వరరావుకి గురువారం అందజేశారు.ఈ వస్తువులు అన్న సంతర్పణ కార్యక్రమంలో వినియోగించనున్నారు.
320 కిలోల గంజాయి
పట్టివేత.. ఇద్దరు అరెస్టు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బేజాంగవాఢ పంచాయతీ బదిలిగూఢ గ్రామం వద్ద బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కలిమెల పోలీసులకు వాహనంలో తరలిస్తున్న గంజాయి దొరికింది. దీంతో వాహనాన్ని అదుపులోకి తీసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిద్దరూ ఎంవి 72 గ్రామానికి చెందిన బబ్లు దత్త, ప్రధీప్ దత్తగా తెలిసింది. గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని తహసీల్దార్ రాజీవ్ బెహరా ఆధ్వర్యంలో తూకం వేయగా 320 కిలోలు ఉందని, రూ.25 లక్షల వరకు విలువ ఉంటుందని తెలిసింది.


