రథయాత్ర భద్రతపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

రథయాత్ర భద్రతపై సమీక్ష

Jul 13 2026 12:58 AM | Updated on Jul 13 2026 12:58 AM

భువనేశ్వర్‌: ఈ నెల 16న జరగనున్న ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథ యాత్ర ఆటంకాలు లేకుండా, క్రమబద్ధంగా జరిగేలా చూడాలని రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన పూరీలోని టౌన్‌ హాల్‌ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్‌ పోలీసు, పరిపాలనా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రథ యాత్రను శాంతియుతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని డీజీపీ ఖురానియా తెలిపారు. ఈ సంవత్సరం లక్షలాది మంది భక్తులు పూరీని సందర్శిస్తారని అంచనా. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, నగరంలోని 8 వేర్వేరు ప్రదేశాలలో కొత్త పార్కింగ్‌ సౌకర్యాలను అభివృద్ధి చేశారు. భక్తులకు సరైన సేవలు, భద్రత కల్పించడానికే ప్రాధాన్యత ఇస్తామని డీజీపీ తెలిపారు. రథ యాత్ర విధులకు అనుభవజ్ఞులైన పోలీసు అధికారులను నియమించారు. ఉత్తర ఛక్‌, పూరీ–కోణార్క్‌ రోడ్‌, నగరంలోని ఇతర ప్రధాన వీధుల్లో ప్రత్యేక

ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేశారు.

ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రముఖుల రాకపోకలు, జన సందోహం నిర్వహణ, కార్డన్‌ వ్యవస్థపై ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ ఆర్‌. పి. కోచె ప్రసంగించారు. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టంగా, సమన్వయంతో తీర్చిదిద్దేందుకు అధికారులందరూ ఒకరితో ఒకరు నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆయన ఆదేశించారు. సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని, భక్తుల పట్ల స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని ఆధునీకరణ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, సౌమేంద్ర ప్రియదర్శి కోరారు. అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు కేటాయించిన పోస్టులను విడిచిపెట్టకూడదని ఆయన అన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా స్థిరంగా, క్రమశిక్షణతో ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు.

ట్రాఫిక్‌ నిర్వహణ, జన సమూహ నియంత్రణ, ప్రముఖుల పర్యటనలు, ప్రజా భద్రత పరస్పరం ముడిపడి ఉన్నాయని రవాణా కమిషనర్‌ అమితాబ్‌ ఠాకూర్‌ అన్నారు. సమావేశానికి అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (ఎస్‌ఏపీ) రాజేష్‌ కుమార్‌, ఇనస్పెక్టర్‌ జనరల్‌ (క్రైమ్‌) డాక్టర్‌ సార్థక్‌ షడంగి, ఇనస్పెక్టర్‌ జనరల్‌ (ఆపరేషన్స్‌) డాక్టర్‌ దీపక్‌ కుమార్‌, ఇనస్పెక్టర్‌ జనరల్‌ (శిక్షణ) అనూప్‌ కుమార్‌ సాహు, ఇనస్పెక్టర్‌ జనరల్‌ (నార్త్‌ సెంట్రల్‌) సత్యబ్రత్‌ భోయ్‌, డిప్యూటీ ఇనస్పెక్టర్‌ జనరల్‌ (ప్రొవిజనింగ్‌) చరణ్‌ సింగ్‌ మీనా, డిప్యూటీ ఇనస్పెక్టర్‌ జనరల్‌ (ఎస్టీఎఫ్‌కె) విశాల్‌ సింగ్‌, డిప్యూటీ ఇనస్పెక్టర్‌ జనరల్‌ (తూర్పు) పినాక్‌ మిశ్రా మరియు డిప్యూటీ ఇనస్పెక్టర్‌ జనరల్‌ (క్రైమ్‌) బి. గంగాధర్‌, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ప్రతీక్‌ సింగ్‌, ఇనస్పెక్టర్‌ జనరల్‌ (సెంట్రల్‌) డాక్టర్‌ సత్యజిత్‌ నాయక్‌ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement