రాయగడ: మద్యం (ఎఫ్‌ఎల్) దుకాణాలనే లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను ఝార్సుగుడ పోలీసులు అరెస్టు చేశారు. ఓరియంట్, బణహార్‌పాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు చోరీ కేసులను ఛేదించారు. అందుకు సంబంధించి గంజాం జిల్లాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఝార్సుగుడ ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర ఈ మేరకు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 8,9 తేదీల్లో రాత్రి ఓరియంట్‌లోని దుకాణంలో కాపలా దారిపై దాడి చేసి అతడిని కట్టేసి, మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసి నగదు, మద్యం సీసాలు దోచుకుని నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి సీసీ పుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇంటెలిజెన్స్ సమాచారంతో పాటు గంజాం, గజపతి జిల్లాల్లో విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. దీంతో గంజాం జిల్లాకు చెందిన ప్రశాంత్ బెహర, కిషన్ పాండే, నారాయణ జెన్న అలియాస్ మిఽథున్, చిత్రసేన్ జెన్నలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.35,700 నగదు, చోరీకి ఉపయోగించిన మహీంద్ర బొలేరో, రెండు క్రొబార్లు, ఒక డీవిఆర్, మూడు మొబైల్ ఫొన్లు, ధ్వంసమైన తాళాలు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గంజాం, నయాఘడ్, ఖుర్ధా, భువనేశ్వర్ ప్రాంతాల్లొ ఇప్పటికే పలు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. వీరు ఇతర జిల్లాలు, పోరుగు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


