● 15న ఆలయ సందర్శన నిలిపివేత
భువనేశ్వర్: ఆచారపరమైన అవసరాల కారణంగా ఈ సంవత్సరం పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో సోదర దేవతల నవ యవ్వన దర్శనం వ్యవధి సాధారణం కంటే తక్కువగా ఉంటుందని శ్రీ జగన్నాథ ఆలయం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఆలయంలో నిర్దేశించిన ఆచారాల కారణంగా జూలై 14వ తేదీ సాయంత్రం జరగాల్సిన నవ యవ్వన దర్శనం భక్తులకు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. ఆలయ సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ఉభ అమావాస్య కారణంగా జూలై 15న దేవతా దర్శనం మూసివేస్తామని ప్రకటించారు.
అనధికారిక వ్యక్తులకు కట్టడి
ఈ ఏడాది రథాలపైకి అనధికార వ్యక్తులను ఎవరినీ అనుమతించరు. రథాల వద్దకు అనధికారికంగా ప్రవేశించడానికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కార్డన్ పాస్ విధానాన్ని యంత్రాంగం కఠినంగా అమలు చేస్తుందన్నారు. అనుమతి లేకుండా నిషేధిత కార్డన్ ప్రాంతంలోకి ప్రవేశించిన వారిని గౌరవప్రదంగా బయటకు తొలగిస్తారు. రథాలపై మొబైల్ ఫోన్లపై ఆంక్షలను పునరుద్ఘాటిస్తూ సేవకులతో సహా రథాలపై ఎవరినీ మొబైల్ పరికరాలను ఉపయోగించడానికి
అనుమతించరు. యాత్ర సమయంలో ఈ ఆదేశం అమలు జరిగేలా చూసేందుకు ఒక ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని నియమించారు.
ఈ సంవత్సరం పూజా కార్యక్రమాలు అధికంగా ఉన్నందున జూలై 14న నవ యవ్వన దర్శనం లేదా నేత్రోత్సవం దర్శన సమయం తక్కువగా ఉంటుంది. ఈ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామి వారి రథ యాత్ర సమీపిస్తున్నందున సేవకులు, ఛొత్తీశా నియోగులు మరియు శ్రీ మందిరం నిర్వహణ కమిటీ స్వామి వారి పూజా కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందువల్ల గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం నేత్రోత్సవం లేదా నవ యవ్వన దర్శనం కోసం టిక్కెట్లతో కూడిన ఆర్జిత దర్శనం లేదా సహన మేళ (సర్వ దర్శనం) తక్కువ సమయం పాటు ఉండవచ్చు. ఇందు కోసం ప్రతి ఒక్కరూ సహకరించి, సహాయపడి, సమన్వయం పాటించాలని సీఏఓ వినయ పూర్వకంగా అభ్యర్థించారు. ఉత్సవ సన్నాహాల్లో భాగంగా ఈ ఏడాది రథం లాగేందుకు 2 సెట్ల తాళ్లను ఏర్పాటు చేసినట్లు ఎస్జేటీఏ ముఖ్య నిర్వాహకుడు తెలిపారు.


