‘పది లక్షల మొక్కలు నాటుదాం’ | - | Sakshi
Sakshi News home page

‘పది లక్షల మొక్కలు నాటుదాం’

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

పర్లాకిమిడి: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా మనం చూడాలని, అందువల్ల ప్రతి విద్యార్థి ఒక మొక్కను మన తల్లి పేరున నాటాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షులు గవర తిరుపతి రావు అన్నారు. గుసాని బ్లాక్‌ దేవితి గ్రామంలో ఉన్న ఓ.యస్‌.ఏ.పి. పోలీసు 3వ బెటాలియన్‌ మైదానంలో 77వ జిల్లా స్థాయి వన మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఫల్గునీ మఝి, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్‌ సహాయ్‌ మీనా, పురపాలక సంఘం చైర్మన్‌ నిర్మలా శెఠి, ఓ.యస్‌.ఏ.పి.కమాండంటు దీప్తి రంజన్‌ జెన్నా, డి.ఎఫ్‌.ఓ. కె.నాగరాజు, ఏ.సి.ఎఫ్‌. షైనీశ్రీ దాస్‌, ఏ.సి.ఎఫ్‌ అరుణ్‌ కుమార్‌ సాహు పాల్గొన్నారు. ఈ ఏడాది జిల్లాలో 10 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించామని, అలాగే అర్బన్‌ ప్రాంతాలైన పర్లాకిమిడి, కాశీనగర్‌ ఎన్‌ఏసీలో పదివేల మొక్కలను నాటడానికి కృత నిశ్చయంతో ఉన్నామని డీఎఫ్‌ఓ కె.నాగరాజు అన్నారు. అలాగే ఏనుగులు జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా ఒక ఆశ్రయం నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. ఫారెస్టు కాకుండా ఇతర ప్రాంతాల్లో 770 హెక్టార్లలో ఐదు వేల మొక్కలు రంప పంచాయతీలో వనమహోత్సవాల సందర్భంగా నాటుతామని ఏసీఎఫ్‌ అరుణ్‌ కుమార్‌ సాహు అన్నారు. జిల్లాలోని ఉత్తమ వనసంరక్షణ సమితి (వి.యస్‌.యస్‌.) గా ఎంపికై న దేవగిరి రేంజ్‌ పరిధి గోటై (నారాయణపూర్‌) వి.యస్‌.యస్‌.కు రూ.50వేల రూపాయల చెక్కును అధికారులు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement