న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026
ఇంధన కొరతపై..
కొరాపుట్: గంటల వ్యవధిలోనే కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లా వాసుల అగచాట్లు పెరిగి పోయాయి. గురువారం యుద్ధ ప్రభావం ప్రజలపై నేరుగా పడింది. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకులు అకస్మాత్తుగా మూసి వేశారు. తమ వద్ద స్టాక్ లేదన్నారు. కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓఎంపీ వద్ద మాత్రమే పెట్రోల్ బంకు తెరిచారు. దాంతో వందల సంఖ్యలో వాహన దారులు బారులు తీరారు. ముందు రోజు లేని కొరత నేడే రావడంతో ప్రజలు మండి పడ్డారు. ఒక్కో బైక్‌కి ఇంధనం దొరకడానికి కనీసం 3 గంటల వ్యవధి పట్టింది. బంకుల యజమానులు మాత్రం తమకు వారం వస్తున్న స్టాక్ రెండు మూడు రోజుల్లో అయిపోతుందన్నారు. వాహన దారులు యుద్ద భయంతో తమ ట్యాంక్ లను ఫుల్ చేసుకుంటున్నారన్నారు.
బ్లాక్‌లో గ్యాస్
గ్యాస్ కూడా దొరకదు అనే పుకార్ల మధ్య నబరంగ్‌పూర్ జిల్లాలో గ్యాస్ బ్లాక్ మార్కెట్ రెట్టింపైంది. గురువారం బ్లాక్‌లో సిలిండర్ ధర రు.2,100 పలికింది. అవి కూడా దొరకని పరిస్ధితి ఏర్పడింది. గ్యాస్ ఏజన్సీల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున్న బారులు తీరుతున్నారు. సిలెండర్ బుకింగ్ 25 రోజుల కాల పరిమితి కావడంతో మరింత ఆందోళన పెరిగింది. ఇదే సమయంలో కరెంట్ పొయ్యిలు కొనడం పై ప్రజలు దృష్టి సారించారు. రూ.3000–రూ.4,000 మధ్య నాణ్యమైన కరెంట్ పొయ్యిలు లభిస్తుండడంతో ముందస్తు జాగ్రత్తగా పెద్ద ఎత్తున్న పొయ్యిలు కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు జీవించడం కష్టంగా మారిందరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి మండి పడ్డారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కొరాపుట్ జిల్లాలో గ్యాస్ సిలెండర్ రు.1,600 పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ప్రజలకు డబుల్ బాధలు పెరిగాయన్నారు. కనీసం వంట వండు కోవడానికి ప్రజలకు గ్యాస్ దొరకడం లేదన్నారు.
గ్యాస్ కోసం క్యూలు
జయపురం: వంట గ్యాస్ కొరతపై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దేశంలో కమర్షియల్ గ్యాస్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో పాటు కమర్షియల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం నియంత్రించింది. దీంతో హొటళ్లు, పలు సంస్థలు కొరతను ఎదుర్కొంటున్నాయి. హొటళ్లు మూతపడే స్థితికి చేరుకున్నాయి. దీంతో ప్రజలు గ్యాస్ బుకింగ్ సెంటర్ల వద్దకు క్యూ కడుతున్నారు. జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నా.. వినడం లేదు.


